నిలోఫర్‌ ఆసుపత్రి నుంచి నెల రోజుల వయసున్న శిశువు(బాబు) కిడ్నాప్‌

శిశువు
Headlines :
  1. నిలోఫర్ ఆసుపత్రి శిశువు కిడ్నాప్: పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు
  2. రెడ్ హిల్స్: తల్లికి దూరమైన నెల రోజుల బాబు
  3. ఆసుపత్రి ఉద్యోగినిగా నటించి పసికందు అపహరణ
  4. ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతల పరామర్శ: బాధిత కుటుంబానికి మద్దతు
  5. శిశువు ఆచూకీ కోసం నాంపల్లి పోలీసులు వేగవంతమైన చర్యలు
రెడ్ హిల్స్ : నిలోఫర్‌ ఆసుపత్రి నుంచి నెల రోజుల వయసున్న శిశువు(బాబు) కిడ్నాప్‌ అయ్యాడు. శిశువు తల్లి స్థానిక నాంపల్లి పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. జహీరాబాద్‌ శేఖాపూర్‌కు చెందిన గఫూర్, హసీనాబేగంలకు నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. జాండీస్‌ రావడంతో స్థానిక డాక్టర్ల సూచన మేరకు 27 రోజుల క్రితం హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎమర్జన్సీ వార్డులో చికిత్సను అందించిన వైద్యులు ఆ శిశువు ఆరోగ్యం కుదుటపడటంతో శనివారం డిశ్ఛార్జ్‌ చేశారు. మందులు రాసిస్తే.. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మందులు తీసుకోవడానికి ఆ శిశువు అమ్మమ్మ ఫార్మాసీ వద్ద లైన్‌లో నిలబడ్డారు. ఆ పసికందుతో కూర్చున్న తల్లి హసీనా వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని మహిళ, తనకు తాను ఆసుపత్రిలో పని చేస్తానంటూ పరిచయం చేసుకుంది. ఇంతలో  సంతకం పెట్టాలంటూ    హసీనాను ఆమె తల్లి పిలవడంతో, అక్కడున్న మహిళ మీరు సంతకం పెట్టిరండి. మీ బాబును నేను ఎత్తుకొని కూర్చుంటానని చెప్పింది. ఆసుపత్రిలో పని చేసే మహిళే కదా.. నమ్మి ఆ శిశువును ఆమెకు ఇచ్చి.. సంతకం పెట్టి వచ్చేలోపే ఆ మహిళ శిశువును అపహరించింది. బాధిత తల్లి వెంటనే స్థానిక నాంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్, కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌లు ఠాణాకు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సైఫాబాద్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆ శిశువును వెతకడానికి నాలుగు బృందాలను రంగంలోకి దింపారు.

*ఆచూకీ లభ్యం*

ఆసుపత్రి నుంచి కిడ్నాప్‌ అయిన శిశువు ఆచూకీ కర్నూలులో లభ్యమైంది. ఐదు గంటల్లో నాంపల్లి పోలీసులు ఈ కేసును ఛేదించారు. మహిళ ముందుగా ఆసుపత్రి నుంచి దాదాపు 3 కి.మీ ఆటోలో ప్రయాణించిన తర్వాత ఆమె తనకోసం ద్విచక్ర వాహనంపై ఎదురుచూస్తున్న వ్యక్తితో వెళ్లింది. అనంతరం ద్విచక్ర వాహనం దిగి మరో వాహనంలో ఆ శిశువును తీసుకొని వెళ్లిపోయింది. సీసీ ఫుటేజ్‌లో కనిపించిన ద్విచక్ర వాహనం నంబర్‌ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు.  వాహనంలో ఎక్కినప్పుడు ఆ వాహనాన్ని గుర్తించారు. మహిళ ప్రయాణించిన వాహనాన్ని గద్వాల పోలీసుల సహకారంతో కర్నూలు వద్ద పట్టుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. నిలోఫర్‌ నుంచి ఎత్తుకెళ్లిన శిశువుతో పాటు ఆ కిడ్నాపర్లతో మరో శిశువు కూడా ఉంది. ఇది పిల్లలని ఎత్తుకెళ్లే మాఫియానా లేక ఆ కిడ్నాపర్లతో ఉన్న మరో శిశువు ఎవరనేది తెలియాల్సి ఉంది. అపహరించుకుపోయిన శిశువుతోపాటు ఆ కిడ్నాపర్లను నాంపల్లి పోలీసులు కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.

Join WhatsApp

Join Now