నవతెలంగాణ
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదు
ఇప్పటికే భర్తీ చేసిన వాళ్ల జోలికెళ్లొద్దు
– కొత్తగా నియామకాలు చట్ట ప్రకారమే ఉండాలి : హైకోర్టు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం రూపొందించిన జీవో 16కు చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోరు పాల్, జస్టిస్ నామారపు రాజేశ్వర్రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 40 పేజీల తీర్పును వెలువరించింది. జీవో 16 చెల్లదంటూ కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలనీ, చట్ట ప్రకారం పరీక్షలను నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేసి పోస్టుల్లో భర్తీ చేయాలని నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. ప్రభుత్వంలోని మొత్తం 40 విభాగాల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రస్తావించారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లు, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యా శాఖలో 131 మంది అటెండర్లు, వైద్యారోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిందని వివరించారు. ప్రభుత్వ జీవో, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్యలు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్నారు. ఈ వ్యాజ్యాలను 2017లో దాఖలు చేయగా అప్పటి నుంచి హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పుడు జీవోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వల్ల ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదు. క్రమబద్ధీకరణ అయిన వాళ్లను సర్వీస్ నుంచి తొలగించ వద్దని హైకోర్టు తీర్పులో తేల్చి చెప్పింది. ఈ తీర్పు ప్రకారం ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలనీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయరాదని స్పష్టం చేసింది. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల ద్వారా చట్టబద్ధంగా మాత్రమే చేయాలని ఆదేశించింది. ఉద్యోగ నియామకాలకు ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ ఉన్నాయనీ, దాన్ని ఉల్లంఘిస్తూ సెక్షన్ 10 ఏ ఉందని పేర్కొంది. ఉద్యోగ నియామకాలకు రెండు సమాంతర ఉత్తర్వులు ఉండటానికి వీల్లేదని నొక్కి చెప్పింది. జీవోను పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెచ్చామనడం చెల్లదని ప్రకటించింది. ‘కాంట్రాక్ట్ విధానంలో నియమితులై క్రమబద్ధీకరణ జరిగిన వాళ్లను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చలేదు. వాళ్లను సర్వీసు నుంచి తొలగించాలని కూడా కోరలేదు. వాళ్లంతా 2009లో నియమితులయ్యారు. 2016లో రెగ్యులరైజ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో వాళ్ల సర్వీసులను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేయలేం. 5500 మందికిపైగా నియమితులైన వాళ్లను కొనసాగించాలి. అయితే ఇకపై ఈ తరహాలో నియామకాలు చేయడానికి వీల్లేదు. 1994 నాటి చట్టంలో సెక్షన్ 10ఏను చేర్చుతూ 2016లో జీవో 16 జారీ చేయడం చెల్లదు. సెక్షన్ 10ఎను చేర్చి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజేషన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. చట్టబద్ధమైన నిబంధనలు ఉన్నప్పుడు వాటికి సమాంతరంగా భిన్నమైన నిబంధనలను చేర్చడానికి వీల్లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సర్కార్ ఎంచుకున్న మార్గం సబబుకాదు’ అని తీర్పులో పేర్కొంది.