ఎల్లారెడ్డి, అక్టోబర్ 14, (ప్రశ్న ఆయుధం):
జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి జి. నాగేశ్వరరావు తెలిపారు.
దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 2025 ఫిబ్రవరి 23న నిర్వహించబడిన ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలి. ఇప్పటికే జరిగిన ప్రవేశ పరీక్షల వివిధ దశల్లో సీటు పొందిన విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులు కాదని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలను మించకూడదని తెలిపారు. అభ్యర్థులు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ నుండి 8వ తరగతి వరకు పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మరియు సంస్థ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయి. తగిన సంఖ్యలో హాజరైన విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో, హాజరుకాని వారికి ద్వితీయ ప్రాధాన్యత, ఇతరులకు తృతీయ ప్రాధాన్యత క్రమంలో లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు అక్టోబర్ 16 మరియు 17 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఎల్లారెడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు లేదా కళాశాలల్లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు తో పాటు హాల్ టికెట్, కులము, ఆదాయ ధృవ పత్రాల ఒరిజినల్ మరియు జిరాక్స్ ప్రతులను సమర్పించాలి.
ఇప్పటికే ఇతర గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు లేదా బదిలీ దరఖాస్తులు సమర్పించే వారు ఈ ఎంపికకు అర్హులు కాదని, ఈ విషయం గమనించవలసినది గా అధికారులు సూచించారు.