ఇవ్వాల్సిన రేవంత్ ఇవ్వడు – అడగాల్సిన కేసీఆర్ ఫాం హౌస్‌లో పంటడు!
పెదవారికి మోసం చేసిన ఇద్దరు నాయకులు – మందకృష్ణ మాదిగ ఫైర్
✦ “రాజీనామా చేయ్ రేవంత్… లేక పెన్షన్ పెంచు” – సభాముఖంగా సవాల్
✦ “కేసీఆర్ లేచి కూర్చోండి… ప్రజల కోసం అడగండి” – ఘాటు విమర్శలు
✦ “రెండు దశాబ్దాలుగా కోట్లాడాం… ఇప్పుడు కోట్లాడుతాం!”
ప్రశ్న ఆయుధం,గజ్వేల్, ఆగస్టు 3:
“వృద్ధులకూ, వికలాంగులకూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచని రేవంత్… ఇవ్వాల్సినవాడు ఇవ్వడంలేదు. మరోవైపు, ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కేసీఆర్ ఫాం హౌస్‌లో పంటున్నాడు” అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.
గజ్వేల్ శోభ గార్డెన్‌లో జరిగిన వికలాంగుల–వృద్ధుల సభలో ఆయన ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ, “పేదల కోసం ఈ నాయకులిద్దరూ ఒత్తిడి చేయడం లేదు. రేవంత్ మోసం చేస్తున్నాడు, కేసీఆర్ పడుకొని మోసం చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేయాల్సిన వారు ప్రైవేటు రాజకీయం చేస్తున్నారు” అన్నారు.
“కేసీఆర్ సీఎం అయినప్పుడే వేలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా ఒక్క మాటా మాట్లాడడం లేదు. నాయకుడిగా విఫలమయ్యారు.”
పెన్షన్ల పెంపు లేనందున వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఒక్కోరు ₹40,000 చొప్పున నష్టపోయారని, మొత్తం రాష్ట్రానికి ₹20 వేల కోట్ల నష్టం జరిగిందని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే డబ్బుతో ముఖ్యమంత్రి రుణమాఫీ పేరుతో డబ్బున్నవాళ్లకు పెట్టాడని తీవ్ర విమర్శలు చేశారు.
“లేనోడ్ని కొట్టి, ఉన్నోడ్ని ఆదుకుంటున్న పాలన ఇది. ఈ మోసాన్ని ఓటుతో తిప్పికొట్టాలి” అన్నారు.
పెన్షన్ పెంచుతావా? లేక పదవి రాజీనామా చేస్తావా? అంటూ సభాముఖంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు. ఈ ఉద్యమం ఇంకా పెద్దదయ్యేలా ఆగస్టు 13న హైదరాబాదులో భారీ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందులో వికలాంగులు, వృద్ధులు, అన్ని ప్రాంతాల పెన్షన్ దారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఓట్ల కోసం మాటలు… అధికారంలోకి వచ్చాక మౌనం.
పింఛన్లు ఇచ్చేవాళ్లే కాకుండా అడిగేవాళ్లూ మౌనమే అయితే, ప్రజల ఆశలు ఎవరు నెరవేర్చాలి?