రేవంత్ రాజకీయం: ఆవేశమే లేదు అంతా పక్కా ప్లానే !
రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడిన బాధలు, చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు, ఇప్పుడు బహిరంగసభల్లో ఇస్తున్న ప్రసంగాలు చూస్తే ఆయన తొందరపడతారేమో అని కొంత మంది కంగారు పడుతూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయాన్ని రాజకీయంగా.. పాలనను పాలనగా చేస్తున్నారు. అదే సమయంలో ఆయన చేయాలనుకున్నది చేస్తున్నారు. పద్దతిగా చేస్తున్నారు. కక్ష సాధింపులన్న ప్రచారం రాకుండా చేస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను చావుదెబ్బ కొట్టడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. కాళేశ్వరం రిపోర్టు విషయంలో రేవంత్ స్లో అండ్ స్టడీ వ్యూహం బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రజల్లో చర్చకు కాళేశ్వరం రిపోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా నాటడంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సక్సెస్ అయ్యారు. ఇపుడు దాన్ని నిరూపించాల్సి ఉంది. నేరుగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తే.. అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కు ప్రభుత్వం తరపున సమాచారం ఇచ్చారు.