భూముల సమస్యల పరిష్కారించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు

*భూముల సమస్యల పరిష్కారించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు*

వైసీపీ హయాంలో ఏపీలో భూముల రీసర్వే జరిగింది. దీంతో పాత సమస్యలతో పాటు కొన్ని కొత్త సమస్యలు తలెత్తాయి. భూరికార్డుల ప్రక్షాళన పేరిట చేపట్టిన రీసర్వే ఇంకా పూర్తికాలేదు.

ఇంతలో ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో భూముల రీసర్వే దాదాపుగా నిలిచిపోయింది. భూసమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భూముల సమస్యల పరిష్కారించేందుకు డిసెంబర్ 1వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గ్రామ, మండల స్థాయిలో సభలు ఏర్పాటు చేసి, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం 45 రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ అధికారిని ప్రతి జిల్లాకు నోడల్ ఆఫీసర్ గా నియమించనున్నారు. భూఅక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, భూరికార్డుల్లో మార్పుచేర్పుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.

ఇప్పటికే భూముల రీసర్వే పూర్తైన గ్రామాల్లో భారీగా ఫిర్యాదులు రావడంతో…రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదుల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా గ్రామ, మండల సర్వేయర్లను ఆయా గ్రామాలకు డిప్యుటేషన్ పై పంపింది. వీరిని తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. భూసర్వే ఫిర్యాదుల పరిష్కారానికి డిసెంబర్ 1న గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.

ఏలూరు జిల్లాలో

ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో భారీగా భూసర్వేపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికే 252 గ్రామాల్లో రీసర్వే పూర్తైంది. భూసమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లను డిప్యూటేషన్ ద్వారా పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఏలూరు జాయింట్ కలెక్టర్ పి. థాత్రి రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు!

ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. సాధారణంగా పట్టణాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తుంటారు. కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని నిర్ణయించింది. భూముల బహిరంగ మార్కెట్ విలువ, స్థానిక అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచుతూ ఉంటుంది. వైసీపీ హయాంలో కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచారు.

కూటమి సర్కార్… జాయింట్ కలెక్టర్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్‌ విలువలపై గత రెండున్నర నెలల నుంచి వివరాలు సేకరిస్తోంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్‌ ఈ కమిటీ పరిశీలనలు, రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై కసరత్తు చేస్తున్నారు. విలువల పెంపు, తగ్గింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 నుచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. స్థానిక అంశాలు ఆధారంగా ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విలువలు ఎక్కువగా ఉంటే తగ్గించే ఛాన్స్ ఉంది. నేషనల్ హైవేలు, గ్రోత్ కారిడార్‌లు, ఇతర అంశాల ప్రతిపాదికన భూముల రిజిస్ట్రేషన్ విలువలు ఖరారు చేయనున్నారు.

2023-24లో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ తో రూ.10 వేల కోట్ల ఆదాయం రాగా… ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రెండువారాల్లో అధికారిక సమావేశం జరగబోతుందని, ఆ సమావేశంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment