పాపం ఊరికే పోదు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
మహబూబ్ నగర్: ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లాగా ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎక్కడ తట్ట పని, పార పని ఉన్నా పాలమూరు జిల్లా వారే కూలీలని తెలిపారు. అందుకు ప్రధాన కారణం మనం చదువులో వెనకబడి ఉండటమే అని పేర్కొన్నారు. స్వరాష్ట్రం వస్తే.. అభివృద్ధి జరుగుతుందని భావించామని చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణ వచ్చాక కూడా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముసాపేట మండలం వేముల SGD కార్నింగ్ కంపెనీలో రెండవ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు..
నేను బాధ్యత తీసుకుంటా…
అప్పట్లో పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం ఒక PG కాలేజీలా మాత్రమే ఉండిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇపుడు విద్యా, ఉపాధి, అవకాశాలను జిల్లా అంది పుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో దివంగత నేత ఇందిరా గాంధీ SC, ST, BCలకు భూములు అసైన్ చేసిందని పేర్కొన్నారు. ఇపుడు చదువుకుంటేనే తలరాత మారుతుందని స్పష్టం చేశారు. మీరు చదువుకోవాలంటే కావలసిన వసతుల కల్పన బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రీన్ ఛానల్ ద్వారా జిల్లా ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
భూమికి బదులు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం..
కొడంగల్, నారాయణపేటకు ఎత్తిపోతల పథకం తెస్తే.. NGTలో ఫిర్యాదు చేస్తున్నారుని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ భూసేకరణ కోసం వెళ్తే.. రైతులు కొడంగల్లో ఇచ్చినట్లు రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. కొడంగల్ పరిస్థితి వేరు.. నారాయణపేట పరిస్థితి వేరు అని స్పష్టం చేశారు. నారాయణ పేట వారికి కావాలంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ఇక్కడ భూసేకరణ కోసం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కలెక్టర్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి..
ప్రతిపక్షాలు.. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మీడియా కూడా లేనిపోని వార్తలకు అపోహలకు తావు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ బ్రహ్మోస్ మిస్సైల్ ఉత్పత్తి చేపట్టేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లకు స్థలాలను చూపించండని కోరారు. గతంలో మన పేదరికాన్ని చూపేందుకు పాలకులు టోనీ బ్లెయిర్‌ను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు మన అభివృద్ధిని.. ప్రాజెక్టులను విద్యా సంస్థలను చూపించేందుకు వివిధ దేశాల నాయకులను పిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొదటి ముద్ద పాలమూరుకు పెడతా..
కుర్చీలో కూర్చున్న ప్రతి నాయకుడు.. ఆయనను నమ్ముకున్న ప్రజలకు మొదటి ముద్దను పెట్టాలని రేవంత్ పేర్కొన్నారు. తనకు ఏ అవకాశం వచ్చినా.. మొదటి ముద్ద పాలమూరుకు పెడతా అని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదని చూసిన వారు.. ఇపుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని.. కౌగిలించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల ఉన్నానని ఒకరు, కవిత వెంట ఉన్నానని మరొకరు అంటున్నారని.. ఎవరి వెనకాల తాను ఎందుకు ఉంటా.. అని ప్రశ్నించారు. తాను ప్రజల అభివృద్ధి కోసం ముందు ఉంటానని వివరించారు. ఒకప్పుడు జనతా పార్టీ చాలా ఫేమస్.. కాల గర్భంలో కలిసిపోయిందని గుర్తు చేశారు. ఏ పార్టీ, ఎవరు శాశ్వతం కాదుని హితవు పలికారు. పాపం ఎప్పుడూ ఊరికే పోదని నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు..