సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 01 (ప్రశ్న ఆయుధం న్యూస్): రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, పాంప్లెట్స్‌ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం లో పలు కార్యక్రమాలునిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. రహదారి భద్రతకు సంబంధించిన సందేశాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. అనంతరం రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి అరుణ, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, జిల్లా రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, డిటిఓ అరుణ, కార్యాలయ ఉద్యోగులు సిబ్బందితో కలిసి రహదారి భద్రతా ప్రతిజ్ఞను చేశారు.
రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288