నిజామాబాద్, సెప్టెంబర్ 24 (ప్రశ్న ఆయుధం): అనుమతులు లేని సంస్థ పేరుతో అమాయక ప్రజల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరిట డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి బుధవారం మీడియాతో వివరాలు వెల్లడించారు.
అయితే, 2022లో నగరంలోని హస్మీ కాలనీలో నివసించే మొయిజ్ ఖాన్ (32) శ్రేమ్ ఎవర్‌గ్రీన్ కంపెనీ పేరుతో కొందరితో కలిసి ఒక సంస్థను స్థాపించాడు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేశారు.
ఈ క్రమంలో మోసపోయిన ఇందల్వాయి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు హకీం ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఇప్పటివరకు 125 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల మేర మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారంలో మరికొంతమంది కూడా పాల్గొన్న అవకాశముండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.