ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ రోడ్‌లో విషాదం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 28:
కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్‌పై ఆదివారం ఉదయం తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి నుండి కరీంనగర్ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటనాస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు.
మృతుడు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పైడాకుల నారాయణగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రమాదం సమయంలో బస్సు వేగంగా వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే వాస్తవ కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సంఘటనతో రైల్వే స్టేషన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. నారాయణ ఆకస్మిక మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.