ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే.. ! ఆర్టీసీ ఎండీ ప్రకటన..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ఇంకా రెండు వారాల సమయమే మిగిలి ఉంది. ఆగస్టు 15న ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అయితే దీని విధివిధానాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఇచ్చే పరిహారం కూడా ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే విషయంలో ఇప్పుడు పరిధి అనేది పెద్ద సమస్యగా మారింది. ఎన్నికల ప్రచారంలో కానీ, కూటమి మ్యానిఫెస్టోలో కానీ ఈ పథకం పరిధి ఎంత అనేది ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇప్పటికే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారనే అంతా భావిస్తున్నారు. కానీ మధ్యలో సీఎం చంద్రబాబు, మంత్రులు ఈ పథకం జిల్లాల పరిధిలోనే అమలు చేస్తామని చేసిన ప్రకటనతో లబ్దిదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అమలు చేస్తామని చెప్పారు. తిరిగి ఆర్టీసీ ఎండీ రాయలసీమ పర్యటనలో ఈ పథకం కొత్త జిల్లాల వరకూ అనుకుంటున్నామని, దీన్ని పాత జిల్లాలకు విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చినట్లయింది. దీనిపైనా విమర్శలు రావడంతో ఆయన తిరిగి మాటమార్చారు. తాజాగా అనంతపురంలో జరిగిన ఉచిత బస్సు పథకం సమీక్ష తర్వాత రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లాల పరిధిలోనా, కొత్త జిల్లాల పరిధిలోనా, ఏ బస్సుల్లో అనుమతి ఉంటుంది, తిరుమల ఘాట్ రోడ్డులో తిరిగే బస్సుల్లో అనుమతి ఉంటుందా లేదా అనే విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఉచిత పథకం పరిధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ వారాంతంలో సింగపూర్ టూర్ ముగించుకుని వచ్చాక ఈ పథకం మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.