దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమ పూజలు
ప్రశ్నాయుధం న్యూస్, అక్టోబర్ 07, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణం స్వప్నలోక్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గా దేవి ఆశీస్సులతో స్వప్నలోక్ కాలనీ సుభిక్షంగా ఉండాలని కాలనీ వాసులు సుఖసంతోషాలతో జీవించాలని, చెడుపై మంచి విజయం సాధించడానికి దేవీ నవరాత్రులు జరుపుకుంటారని ఆలయ కమిటీ వారు తెలిపారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున గణపతి పూజ, పుణ్య వచనం, పంచ గవ్య ప్రాసన, అంకురార్పణ, అష్టదిక్పాలకుల స్థాపన, షోడశ గౌరీ సప్తమాతృక పూజ, కలశ స్థాపన, నవగ్రహ పూజ, అఖండ దీపారాధనతో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
నవరాత్రి వేడుకల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు గాయత్రి దేవిగా, మూడవరోజు లలితా దేవి, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా, ఐదవ రోజు చండీ మాతగా దర్శనమిచ్చారు. గురువారం అమ్మవారి ప్రతిష్ఠాపన, శుక్రవారం కౌమారిపూజలు, శనివారం
హోమం, ఆదివారం సుహాసిని పూజలు, సోమవారం కుంకుమ పూజలు, అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భవాని మాలాదారులతో పాటు భక్తులు తరలివచ్చి దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడకల గోవర్ధన్, నీలం రమేష్, మచ్చ నాగరాజు, ధర్మ మురళి, అశోక్ రెడ్డి, లింగం స్వాములు, పసులాది రాజు, ప్రశాంత్, పడిగల రాములు, వాంఖరే అశోక్, రజనీకాంత్ రెడ్డి, భక్తులు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.