దేశం కోసం పోరాడుతున్న మన సైనికుల త్యాగాలకు వందనం
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తానీయులను మట్టి కరిపించిన భారత్ సైనికులకు అందరం అండగా ఉండాలి
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ విజయవంతం
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 16( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
మన భారతదేశం కోసం అనునిత్యం శ్రమిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్న భారత సైనికుల సేవలు అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. భారత్ పై దాడి చేసిన పాకిస్తాన్ ను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎదురుదాడి చేసి విజయవంతం అయిన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ జెండాలు పట్టుకొని సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పార్వతిపురం పాత బస్టాండ్ లో ప్రారంభించి అక్కడి నుంచి నాలుగు రోడ్లు జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి, జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాకైతే జాతీయగీతం విన్నా, జాతీయ పథకం చూసినా నాలో తెలియని ఉత్తేజం వస్తుందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన భారతీయ సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగిందని, ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. మన భారత ప్రభుత్వం మన జవాన్లకు అత్యాధునికరణ మిస్సయిల్స్ ను అందించడం ఆనందంగా ఉందని, ఈ కారణం వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడం జరిగిందని, ఇది చాలా ఆనందించదగ్గ విషయం అన్నారు. ఇండియాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తామని మన సైనికులు పాకిస్థాన్ కు ఆపరేషన్ సింధూర్ ద్వారా రుజువు చేశారన్నారు. మనం తలచుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ ను తొలగించే శక్తి ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ కి ప్రధాన నాయకత్వం వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. అలాగే ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, ఇదే స్ఫూర్తితో మన భారతదేశాన్ని అందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, యువతీ యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.