*కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపం:* *సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్*

*ఒకవైపు మందుల కొరత.. మరో వైపు బడుల మూత*

*ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకక రోగులు అవస్థలు*

*ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడే పరిస్థితి*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పరిపాలన పడకేయడంతో జిల్లా ప్రజలకు సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకక రోగులు అవస్థలు పడుతుంటే, మరోవైపు ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. వానాకాలం మొదలైనప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు తీసుకోకపోవడం వల్ల జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో ప్రజలు మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాల భారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్య కోసం సర్కారు ఆసుపత్రులకు వెళ్తే అక్కడ మందులు లేకపోవడంతో సరైన వైద్యం అందడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రాంతీయ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కనీసం మూడు నెలల బఫర్ స్టాక్ మందులు ఆసుపత్రుల్లో ఉండేలా చూడాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ప్రజలకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన జిల్లా వైద్యాధికారి ఏం చేస్తున్నారని..? మండలాన్ని ఇక ఇంటర్నేషన్ పాఠశాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో డబ్బా కొట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారని అన్నారు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే విధంగా చేస్తున్నారని చింతా ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా, విద్యావాలంటీర్లను నియమించకుండా చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్య సంవత్సరం ప్రారంభమై మూడు నెలల కావస్తున్నా.. టీచర్ల కొరత వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు టీచర్ల కొరత లేకుండా ఉండేందుకు గాను విద్యావాలంటీర్లను నియమించి విద్యాబోధన కొనసాగించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చింతా ప్రభాకర్ తెలిపారు.జిల్లాలోని 1247 పాఠశాలల్లో 1,111 ఉపాద్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే పాఠశాలల్లో విద్యాబోధన ఎలా సాగుతుందో పాలకులే సమాధానం చెప్పాలన్నారు. జిల్లా విద్యాధికారులు పాఠశాలలు సందర్శిస్తే సమస్యలు వెలుగు చూస్తాయన్నారు. రాజకీయాలు చేస్తూ రోజులు గడిపేయడం పక్కనబెడితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతాయన్నారు. పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరి వల్ల రోగులకు వైద్యం అందడం లేదని, పిల్లలకు విద్య అందక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రికి పతనమవుతున్న విద్య, వైద్యశాఖల తీరు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్లను తక్షణమే నియమించి, పిల్లలకు విద్యాబోధన జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now