*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి : సంజయ్ రౌత్..!!*
హైదరాబాద్: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా తేలలేదు. నాలుగు రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. గత శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలన్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. నవంబర్ 26వ తేదీతో శాసనసభ పదవీకాలం కూడా ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిని కూడా నిర్ణయించలేదు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.