సాధారణంగా కొన్ని గ్రామాల్లో మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికైనా.. అధికారాలు మాత్రం వారి భర్తలే అనుభవిస్తూ ఉంటారు. ఏదో రిజర్వేషన్ల ప్రకారం.. మహిళలను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించి.. గెలిచిన తర్వాత వారి భర్తలు.. పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఇక కొందరు తమ కుమార్తెలను, తల్లులను సర్పంచ్‌లుగా గెలిపించినా.. పదవులు మాత్రం వారే అనుభవిస్తూ ఉంటారు. ఇది చట్ట ప్రకారం తప్పే అయినా.. అందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎక్కడా అలాంటి దాఖలాలు కనిపించవు. గ్రామాల్లో మహిళలు సర్పంచ్‌లుగా ఉంటే వారు కేవలం సంతకాలు, సభలకు హాజరు కావడమే తప్పితే.. చక్రం తిప్పేది మొత్తం వాళ్ల భర్తలే అయి ఉంటారు.
మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినా.. వాటిని దుర్వినియోగం చేస్తూ పురుషులే ఇలా లింగ వివక్ష చూపుతున్నారనే ఫిర్యాదులు కోకొల్లలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలా పురుష ఆధిపత్యానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయగా.. తాజాగా ఆ కమిటీ కొన్ని సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చాలా మంది సర్పంచ్‌లుగా మహిళలు ఎన్నికైనా వారి భర్తలు పెత్తనం చేస్తుండగా.. అలాంటి వారికి భారీగా ఫైన్లు విధించాలని కమిటీ సూచించింది. ఇలా పరోక్షంగా సర్పంచ్‌గా పెత్తనం చేస్తూ.. మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారిపై జరిమానాలు విధించాలని కమిటీ వెల్లడించింది.
సుప్రీంకోర్టు సూచన మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవలె పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది. ఇందులో భర్తలు, తండ్రులు, కుటుంబంలోని ఇతర పురుషులు.. సర్పంచ్ అధికారాల్లో పెత్తనం చేయడాన్ని నిరోధించాలంటే మహిళలకు వ్యవస్థాగతంగా ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఎన్నికైన మహిళా ప్రతినిధులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని తెలిపింది. పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తీసుకురావాలని సుశీల్ కుమార్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళలకు గ్రామాల్లో పాలన కొనసాగించేందుకు కావాల్సిన ట్రైనింగ్ వారికి ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా మహిళా సర్పంచ్‌లకు న్యాయపరమైన సలహాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళలకు అండగా ఉండేందుకు ఒక వ్యవస్థను సృష్టించాలని కమిటీ హితవు పలికింది.