సంగారెడ్డి, డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌గా చిన్న సాయి శ్రీరామ్, ఉప సర్పంచ్‌గా అసద్ ఖాన్‌లను ఎంపీడీఓ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పాలకవర్గ సభ్యులుగా కె. స్రవంతి, టి.వేణుగోపాల్ రెడ్డి, ఎన్.పద్మారావు, బి.సంతోష్, బి.భాస్కర్ గౌడ్, ఎస్.సాయి గౌడ్, పి.వెంకటసాయి, వి.లక్ష్మి, కె.మంజుల, ఎండి.చాంద్ పాషా, హాజీబీ, ఎం.డి.గౌస్, సాజియాలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి సహాయ సహకారాలతో కంది గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పాలకవర్గం సమిష్టిగా పని చేస్తుందని తెలిపారు. ప్రతి వార్డులో రెండు బోరుబావుల తవ్వకాలు చేపట్టి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. అందరి సహకారంతో పారదర్శక పాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కంది గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపే దిశగా నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కంది గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ చిన్నసాయి శ్రీరామ్
Oplus_16908288