Site icon PRASHNA AYUDHAM

ఈసారి సర్పంచ్ ఎన్నికలు రసవత్తరం..

IMG 20251201 183853

*పార్టీలలో టికెట్ రాజకీయాలు..*

*పార్టీ కోసం పని చేసిన వారికి చుక్కెదురు.?*

*ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపాటు.*

*20, 30 ఏళ్ల సేవ వృథా..?*

*నేతల్లో తిరుగుబాటు మోగిస్తున్న టికెట్ ఆశావాహులు.*

*పదవి కోల్పోయిన వారికి పూచీకత్తులు – కష్టపడిన వారికి నిరాశే.?*

*స్థానిక ఎన్నికల హీట్.. పార్టీలలో ఆంతర్యుద్ధం.*

*పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి.. కొత్తవారికి టికెట్లు..?*

*కొత్తవాళ్లకు టికెట్.. సీనియర్ల అయోమయం..*

*సర్పంచ్ టికెట్లపై గందరగోళం.*

*ఒక్కో గ్రామంలో ఒకే పార్టీ నుంచి 10 వరకు నామినేషన్లు దాఖలు*

*జిల్లా, రాష్ట్ర నాయకులకు తలనొప్పిగా మారిన వైనం*

ప్రశ్న ఆయుధం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మహేష్ గౌడ్, డిసెంబరు 1: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేగంగా మారుతోంది. గ్రామాలు, మండలాలు ఎన్నికల హడావుడితో మారుమోగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత నామినేషన్ల దశలో గ్రామాలు రాజకీయ కసరత్తులతో కిక్కిరిసిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు బహిరంగంగా బయట పడుతున్నాయి. 20, 30 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తూ, పార్టీ కోసం కష్టాలు పడుతూ, విజయ– పరాజయాలు రెండూ భుజాన వేసుకున్న నాయకులకు ఈసారి సర్పంచ్ టికెట్ కూడా దక్కకపోవడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మరోవైపు, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. పదవులు అనుభవించిన కొందరు నాయకులు… అధికార మార్పుతో పాటు తమ రాజకీయ రంగు కూడా మార్చుకొని తాజాగా కాంగ్రెస్‌లో చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కొత్తగా వచ్చిన ఈ నేతలకు టికెట్లు ఇచ్చేసి, పాత నాయకులను రెండో, మూడో వరుసల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక్కో గ్రామంలో ఒకే పార్టీ నుంచి 10 వరకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఒకే మాట వినిపిస్తోంది.. “ఇన్నేళ్లు పార్టీ కోసం తీరిగ్గా పని చేసిన మాకా..? నిన్న మొన్న వచ్చి చేరిన వారికా ప్రాధాన్యం..?” బహిరంగంగానే పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలు తమ పాత బలం, ఆర్థిక శక్తి, స్థానిక నెట్వర్క్‌ను ఉపయోగించి మరో సారి పదవి చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుండటం కార్యకర్తల్లో అసహనానికి దారి తీసింది. మన పార్టీకి కష్టకాలంలో తలదన్నిన వాళ్లను కాదని, అధికారంలో ఉండగా ఎదిగిన వారిని మళ్లీ ముందుకు తేవడం పార్టీకి నష్టం చేస్తుందని నేతలు సూటిగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో గ్రామాల్లో కాంగ్రెస్‌లో తీవ్ర అంతర్గత యుద్ధం నడుస్తోంది. నాయకులు, కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ, పాత–కొత్త వర్గాలుగా విడిపోయారు. ఇలా అన్యాయం కొనసాగితే పోలింగ్ రోజునే అసలు దెబ్బ పడుతుందని కొంత మంది సీనియర్ నేతలు స్పష్టంగా పేర్కొంటున్నారు. స్థానిక స్థాయిలో టికెట్ కేటాయింపులు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. గ్రామాల రాజకీయాలు స్వరూపం మార్చేసే స్థాయిలో ఈ అసంతృప్తి ప్రభావం కనిపించే అవకాశం ఉందని స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామ తెరపై ఎన్నికల సందడి ఉంది… కానీ కాంగ్రెస్‌లో మాత్రం టికెట్ రాజకీయం దుమారం రేపుతోంది. పాత నేతల జ్వాల మళ్లీ పార్టీ వ్యూహాలనే దెబ్బతీయదా..? అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version