సత్యమేవ జయతే – నిజామాబాద్

2010లోనే అదిలాబాద్‌-వటాన్‌చెరు రైల్వే ప్రతిపాదన!

– కేంద్ర రైల్వే మంత్రిగా మమత బెనర్జీ ఉన్నప్పుడే ప్రకటన…

– 15 ఏళ్ల క్రితం రెండు రైల్వే లైన్లను మంజూరు చేసిన వైనం…

– తాజాగా తెరమీదికి తీసుకువచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి…

– పాత ప్రతిపాదనను తమ ఘనతగా బీజేపీ సర్కారు ప్రచారం…

– ఇప్పటికీ పూర్తి కాని బోధన్‌ – బీదర్‌ రైల్వేలైన్‌ నిర్మాణ పనులు…

సత్యమేవ జయతే – నిజామాబాద్ 

నిజామాబాద్ : పటాన్‌చెరు – ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బోధన్‌, నారాయణ్‌ఖేడ్‌, సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరుకు చేరుకునేలా దీనిని నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేరిట విడుదలైన లేఖలో జనవరి 7, 2025న నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ తనకిచ్చిన లేఖ ఆధారంగా రైల్వే లైన్‌ మంజూరు చేసినట్లుగా పేర్కొన్నారు.

కానీ ఇందులో ఓ మర్మం ఉంది. ఈ రైల్వే లైన్‌ మంజూరు అన్నది కొత్తది కాదు పాతది. సరిగ్గా 15 సంవత్సరాల క్రితమే మంజూరైంది. ప్రస్తుత పశ్చిమ బెంగాళ్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాడు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బోధన్‌ – బీదర్‌, పటాన్‌చెరు – ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రజల అవసరాలను గుర్తించని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం పాత ప్రతిపాదనలకు కొత్త లేఖలు విడుదల చేసి తామేదో ఇచ్చినట్లుగా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది.

ఇంకో విడ్డూరం ఏమిటంటే పటాన్‌చెరు(నాగలపల్లి) – ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ 317 కిలో మీటర్ల నిర్మాణానికి రూ.5706 కోట్లు అంచనాలను 2023, సెప్టెంబర్‌ 8న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విడుదల చేసింది. ఫైనల్‌ లోకేషన్‌ సర్వే(ఎఫ్‌ఎల్‌ఎస్‌) మంజూరైనట్లుగా పేర్కొంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సహా నిజామాబాద్‌ ఎంపీ పేరిట ద్వంద ప్రకటనలు వెలువడటం విడ్డురంగా మారింది.

– పాత ప్రాజెక్టుకు కొత్త సోకులు…

తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల మధ్య రైల్వే కనెక్టివిటీ పెంపుకై బోధన్‌ – బాన్సువాడ – బీదర్‌ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్ల కల అయినటువంటి బోధన్‌ – బీదర్‌ రైల్వే లైన్‌కు సర్వే కోసం పచ్చజెండా ఊపారు. అదే సమయంలోనే ఆదిలాబాద్‌ – పటాన్‌చెరు మధ్య మరో రైల్వే లైన్‌కు సర్వే చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకే సారి రెండు రైల్వే లైన్‌ కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు.

కానీ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బోధన్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరుకు రైల్వే కనెక్టివిటీ 250 కిలో మీటర్లు మేర నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం రూ.5వేల కోట్లు వరకు వెచ్చించాల్సి ఉండగా 15 ఏళ్ల తర్వాత కేంద్ర సర్కారు స్పందించి డీపీఆర్‌ రూపకల్పనకు అడుగు ముందుకేసింది.

అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలకు పటాన్‌చెరు – ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌పై తిరిగి దృష్టి సారించింది. వాస్తవం ఇలా ఉంటే ఇదంతా తన వల్లే వచ్చిందంటూ నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యుడు ప్రచారం చేసుకుంటుండటం వింతగా మారింది. ఆయన పేరిట విడుదలైన ప్రెస్‌నోట్‌లో తన వల్లే ఈ రైల్వే లైన్‌ సిద్ధించినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏక కాలంలో బోధన్‌ – బీదర్‌, పటాన్‌చెరు – ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌లకు పుష్కలంగా నిధులు తీసుకు వచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని నిజామాబాద్‌ ప్రజలంతా ఎంపీ అర్వింద్‌ను కోరుతున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వపు ప్రతిపాదన…

బోధన్‌ – బీదర్‌ రైల్వే లైన్‌ 138 కిలో మీటర్లుగా ప్రతిపాదించారు. ఇందులో తెలంగాణలో 90 కిలో మీటర్లు, మహారాష్ట్ర, కర్నాటకలో 48కిలో మీటర్లుగా ఉంది. 2011 ఏప్రిల్‌లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తైంది. బోధన్‌ నుంచి రుద్రూర్‌, వర్ని, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్‌, బీదర్‌ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 కోట్ల వ్యయంతో లైన్‌ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ – బోధన్‌ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3కిలో మీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి.

దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. ఎన్డీయే సర్కారు గడిచిన దశాబ్దంలో ఈ ప్రాజెక్టుపై సీరియస్‌గా దృష్టి సారించలేదు. బోధన్‌ – బీదర్‌ రైల్వే లైన్‌ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్‌ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష సుమారు శతాబ్ధ కాలంగా కలగానే మిగిలి పోతోంది. గతంలో రూ.1,029 కోట్లు వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు మళ్లీ తీవ్ర జాప్యం కారణంగా ప్రస్తుతం అంచనా వ్యయం రెట్టింపు అయ్యింది.

Join WhatsApp

Join Now

Leave a Comment