సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎస్సీ, ఎస్టీల సమస్యలు అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మానిటరీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్లో ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కోర్టు కేసులు, రెవెన్యూ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పరిస్థితులు, సీనియర్ సిటిజన్ సమస్యలు వంటి పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల విచారణను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి నెలా ఆయా మండలాలలోని ఒక గ్రామంలో రెవెన్యూ, పోలీసు అధికారులు సివిల్ రైట్స్ డే, ను గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సీనియర్ సిటిజన్ల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు పారితోషకం వెంటనే అందించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. లేబర్ యాక్ట్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వసతి గృహాలలో కొత్త మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదో లేదో డివిజన్ జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పరిశీలించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలలో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు మెరుగు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన మెనూ ప్రకారం ప్రతిరోజు వంటలు వండి విద్యార్థులకు అందించాలన్నారు.
హాస్టల్ వార్డెన్ ల కొరత రాకుండా, నియామకాలలో జిల్లాలోని అన్ని డివిజన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహనీయుల విగ్రహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ నెలసరి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిడి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.