అక్రిడేషన్ కార్డు ఉన్నవారే విలేఖరులా? ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చేతిలో రిపోర్టర్లపై దాడి
నిజామాబాద్, అక్టోబర్ 18 (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్ లో చోటుచేసుకున్న సంఘటన విలేకరుల హక్కులు, స్వేచ్ఛలపై ప్రశ్నలు కలిగిస్తోంది. శనివారం నాడు బోధన్ వైపు వెళ్తున్న కొంతమంది విలేకరులు రోడ్డుపై అనుమానాస్పదంగా ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్‌ను గమనించారు. ఇక్కడ ఇసుక ఎలా తరలిస్తున్నారు? ఎవరికి అనుమతులు ఇచ్చారు? అనే సందేహంతో ట్రాక్టర్ వద్దకు వెళ్లారు.
అక్కడ ఉన్న ట్రాక్టర్ కు ఎలాంటి నెంబర్ ప్లేట్ లేకుండా ఇసుక రవాణా జరుగుతుందని అనుమానంతో అక్కడున్న రిపోర్టర్ అడగగా,
స్థానికంగా పనిచేస్తున్న కార్మికులను ప్రశ్నించగా, వారు బాపునగర్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లింగానికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చిన లింగం, విలేకరులను కేవలం “అక్రిడేషన్ కార్డు చూపించండి” అని డిమాండ్ చేశాడు. కార్డు చూపించలేదని కారణంతో, విలేకరులను బెదిరించి, “మీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు వేస్తాం” అంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో విలేకరుల మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కొన్నాడు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి ఇద్దరు విలేకరులపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇక, ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న జాయింట్ కలెక్టర్‌కు విలేకరులు సహాయం కోసం చేతులు ఊపగా, కొద్దిదూరంలోకి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. కానీ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవడం గమనార్హం. తాను కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడినని చెప్పుకున్న లింగం, “ఇది మా ప్రాంతం, మేము చెప్పిందే చట్టం” అంటూ తప్పుడు ధీమా ప్రదర్శించాడు.
విలేకరుల్లో ఒకరు 100 నెంబరుకు కాల్ చేయగా, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, లింగం దగ్గర రిపోర్టర్ ల మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వోను సంప్రదించగా, “ఇక్కడ ఇసుక లేనప్పుడు, ఎక్కడైనా ఉందని అనిపిస్తే అక్కడినుంచైనా తీసుకుందామన్న అనుమతినిచ్చాం” అంటూ వింత వివరణ ఇచ్చారు.
పోలీసుల తీరు ప్రశ్నార్థకం
అక్రిడేషన్ కార్డు చూపించలేదని విలేకరులను బెదిరించడం, మొబైల్ లాక్కోవడం, దాడికి పాల్పడడం వంటి చర్యలు ప్రశ్నలు రేపుతున్నాయి. అక్రిడేషన్ కార్డు లేకపోతే విలేకరులు కాదా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. జర్నలిస్టుగా పనిచేయాలంటే తప్పనిసరిగా అక్రిడేషన్ కార్డు అవసరమా? అన్న చర్చ నడుస్తోంది.
ఇది విలేకరులపై సరైన దృష్టికోణం కాదు. ఈ ఘటనపై పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది.
అక్రిడేషన్ కార్డు ఉన్నవారే విలేఖరులా? ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ చేతిలో రిపోర్టర్లపై దాడి
Published On: October 18, 2025 8:05 pm