ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలి

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, నెల రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరం లో భూ, అట్రాసిటీ సమస్యలపై రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ, ఇతర శాఖల అధికారులతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్, అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు తో కలసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను డీఎస్పీలు రెహమాన్, సతీష్ , కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పలు భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల గురించిన వివరాలను కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ఛైర్మన్ ను కోరారు.ఈ సందర్భంగా భూ వివాదాలకు సంబంధించిన కేసులు, అట్రాసిటీ కేసుల పరిష్కారం ఎన్ని రోజుల్లో జరుగుతుందని కలెక్టర్ మరియు పోలీస్ అధికారులను ఛైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎంతమంది బాధితులకు పరిహారం అందిందని వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ని అడిగి తెలుసుకున్నారు. పంచాయితీ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, వైద్య శాఖ ల పరిధిలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఉన్నారు,ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కస్తూరిబా మరియు అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎన్ని పాఠశాలలలో పనులు చేపట్టారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే తప్పకుండా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. గ్రామాలలో నిర్వహించే సివిల్ రైట్స్ డే కు అన్ని కులాలు హాజరయ్యేలా అధికారులు చూడాలన్నారు. సివిల్ రైట్స్ డే నిర్వహణ కు సంబంధించి సంవత్సర కాలానికి తహసీల్దార్, ఎస్సై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సివిల్ రైట్స్ డే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా భూ సమస్యలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సివిల్ రైట్స్ డే ను నిర్వహించకపోతే చర్యలు ఉంటాయన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. భూముల సమస్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలన్నారు. బాధిత ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా నిలుస్తుందన్నారు. మెస్ చార్జీలు పెంచినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎస్టి, ఎస్సీ లకు ప్రత్యేక కోర్టు మంజూరుకు కృషి చేస్తానన్నారు. భద్రాచలం మొబైల్ కోర్టు న్యాయమూర్తి నియామకానికి తగిన చర్యలు తీసుకున్నట్లు త్వరలోనే అన్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో, కస్తూరిబా విద్యాలయాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నెలకొన్న సమస్యలను గుర్తించాలని, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ బక్కి వెంకటయ్య అన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో నమోదైన మొత్తం కేసులపై తహసీల్దారుల నుండి ప్రాథమిక నివేదికలు అందాయని, వాటిపై 30 రోజులలో పరిష్కరించి సమగ్ర నివేదికను కమిషన్ కు అందజేస్తామని తెలిపారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో గడిచిన 10 సంవత్సరాలలో 893 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయాయని, వాటిలో 31 కేసులు పెండింగ్లో ఉన్నాయని 30 రోజుల్లో పరిష్కరించి సమగ్ర నివేదికలు కమిషన్ కు అందిస్తామని తెలియజేశారు.
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ* ఎస్సీ ఎస్టీలు జిల్లాలో అధికంగా ఉన్నారని, వారి యొక్క సమస్యలు మరియు భూ తగాదాలు త్వరితగతిన పరిష్కరించడానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కంపెనీలు మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థలలో కూడా ఎస్సీ ఎస్టీలకు ఉపాధి కల్పనలో రిజర్వేషన్ కల్పించాలని దానికి గాను చర్యలు చేపట్టాలని కమిషనర్ ను కోరారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, రాష్ట్ర ఎస్ టి ఎస్ సి కమిటీ సభ్యులు రాంబాబు నాయక్, నారాయణ, ప్రవీణ్,ఆర్టీవోలు మధు, దామోదర్ రావు, షెడ్యూల్ తెగల అభివృద్ధి శాఖ అధికారి అనసూయ, జిల్లా అధికారులు, తాసిల్దారులు ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు ఏనుమూరి లక్ష్మీబాయి, రవికుమార్, లావుడియా సామ్య, లకావత్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు తదితరు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now