Headlines :
-
నోటిఫికేషన్ లేకుండానే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ
-
కరీంనగర్ మెడికల్ కళాశాలలో రహస్య నియామకాలు
-
అర్హుల విరుద్ధంగా ఉద్యోగ నియామకాలు: నిరుద్యోగుల ఆందోళన
-
మెడికల్ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీపై విచారణ డిమాండ్
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గుట్టుగా లాబ్‌టెక్నీషియన్ల రిక్రూట్‌మెంట్
ఆలస్యంగా వెలుగులోకి..
కరీంనగర్ జిల్లా న్యూస్ ప్రతినిధి – శేఖర్ ; ప్రభుత్వ శాఖల్లో ఏ ఉద్యోగం భర్తీ చేయాలన్నా నోటిఫికేషన్ తప్పనిసరి. కానీ, కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మాత్రం ఈ నిబంధన వర్తించనట్టున్నది. రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను గుట్టుగా భర్తీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల్లో పనిచేస్తున్న ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఒకరు చనిపోగా, మరొకరు మానేశారు. దీంతో ఈ పోస్టుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని ఎవరికీ తెలియకుండా భర్తీ చేశారు. 2024 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబర్ 477 పేరిట కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీశారు. కానీ, ఈ విషయం తనకు తెలియదని, పరిశీలించి చెబుతానని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. అయితే, గత సెప్టెంబర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా భర్తీ అయిన ఈ ఇద్దరు ఉద్యోగులు ఇప్పటి వరకు ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లో కాకుండా స్థానిక ప్రభుత్వ జనరల్ దవాఖానలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. గుట్టుగా రిక్రూట్ అయిన ఈ ఉద్యోగులు నిజానికి ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లోనే పనిచేయాలి. కానీ, అక్కడ విధులు నిర్వహిస్తే అందరికీ తెలిసి పోతుందనే ఉద్దేశంతో కొంత కాలం జనరల్ దవాఖానలోని ల్యాబ్‌లో పని చేయాలని వీరిని అక్రమంగా రిక్రూట్ చేసిన అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
గుట్టుగా జరిగిన రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ విషయంలో అర్హులైన కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే కాకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా జరిగిన ఈ రెండు పోస్టుల విషయంలో అర్హులైన కొందరు అభ్యర్థులు ఇప్పటికే కలెక్టర్‌తో సహా పలువురు వైద్యాధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నట్లు తెలిసింది. అయితే, వారధిలో దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి భర్తీ చేశామని, అధికారులు తమ చర్చను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారధిలో తాము కొన్నేండ్ల కిందనే దరఖాస్తు చేసుకుని ఉన్నామని, తమకు కాకుండా కొత్త వారికి అవకాశం ఎలా వచ్చిందని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ కవితను ఈ విషయమై వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, తాను సెలవుల్లో ఉన్నానని స్పష్టం చేశారు. నిజానికి ప్రిన్సిపాల్ పేరిటనే నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరు సంతకంతో ఈ నియామక పత్రం జారీ అయ్యింది. అసలు ఈ ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకం ప్రిన్సిపాల్‌కు తెలిసే జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడిన అనతి కాలంలోనే ఇలాంటి ఆరోపణలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారులు నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఎవరికీ తెలియకుండా నియామకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల లేఖలు సిఫారసుగా చూపి కొందరు అధికారులు పెద్ద మొత్తంలో నియామకాల దందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా మెడికల్ కళాశాలతోపాటు, జనరల్ దవాఖానలో కొత్తగా జరుగుతున్న ప్రతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల విషయంలో విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.