*వెంగళరాయసాగర్ బాగోగులు చూడండి…!*
*అదనపు ఆయకట్టు పనులు తక్షణమే పూర్తి చేయాలి
*కాలువల్లో డీ సిల్టింగ్, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి*
*పొలాలకు రాకపోకలు సాగించే వంతెనకు మరమ్మత్తులు చేపట్టాలి
*వెంగళ రాయసాగర్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 18( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
పార్వతీపురం మన్యం జిల్లాలోని, సాలూరు నియోజకవర్గం లో గల గోముఖి నదిపై నిర్మించిన వెంగళరాయసాగర్ బాగోగులు చూడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోరారు. కాంగ్రెస్ పార్టీ సాలూరు నియోజకవర్గం ఇన్చార్జి గేదెల రామకృష్ణ, ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు పందిరి మామిడి వలస, ముచ్చర్ల వలస గ్రామాల సమీపంలోని వెంగళరాయ సాగర్ తో పాటు సాగర్ కు చెందిన నీటిపారుదల కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంగళ రాయసాగర్ అదనపు ఆయకట్టు పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. దానికి అవసరమైన పెండింగ్లో ఉన్న భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన చేపట్టాలన్నారు. 2013 నాటికి సుమారు 20% మాత్రమే పనులు పూర్తి చేసి, మిగతా పనులు పూర్తి చేయకుండా, 2017లో పూర్తిగా నిలుపుదల చేయటం అన్యాయం అన్నారు. తక్షణమే మిగతా పనులకు అవసరమైన 21 ఎకరాల భూ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన భూ సేకరణ చేసి పెండింగ్ పనులకు అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చేసి అదనపు ఆయకట్టు పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే కాలువల్లో డీ సిల్టింగ్, జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. అలాగే రైతులు పొలాలకు రాకపోకలు సాగించే కాలువ వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. వెంగళరాయసాగర్ ద్వారా సాగునీరు ఇటువంటి ఇబ్బందులు లేకుండా పొలాలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఏటా వెంగళరాయ సాగర్ నిర్వహణ సక్రమంగా జరిగేలా అధికారులు, పాలకులు తగు చర్యలు చేపట్టాలని కోరారు.