*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 2
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం.లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వెంటనే ఇన్ఛార్జి మంత్రుల నుంచి జాబితాను ఆమోదించాలని సూచన.ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టీకరణ.
ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా మరియు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ కాకుండా ఉండేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నా ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరిక.అర్హులైన నిరుపేదలను మాత్రమే ఎంపిక చేయాలని, లిస్ట్-1, లిస్ట్-2, లిస్ట్-3లతో సంబంధం లేదని స్పష్టీకరణ.
భూ భారతిపై రెవెన్యూ సదస్సులు.
ఈనెల 5 నుంచి 20 వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడి.పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31 వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని దరఖాస్తులను తిరస్కరిస్తూ లిఖితపూర్వకంగా కారణం తెలపాలని కలెక్టర్లకు సూచన.
ఇప్పటివరకు 605 మండలాలకు గాను 590 మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని, ఇందులో 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు పాల్గొన్నారని వెల్లడి.
ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ లేనివారి వివరాలు సేకరించాలని ఆదేశం.
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.ఈనెల 4న జరగనున్న నీట్ పరీక్షకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచన.
ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడి.పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశం.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సూచనలను ముందుగానే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచన.ఈ వీడియో కాన్ఫరెన్సులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, సి.సి.ఎల్.ఎ డైరెక్టర్ మకరంద్, హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి. వి. పి. గౌతమ్, లా & ఆర్డర్ డిఐజి మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.