టీటీడీ ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యాలు చేశారు. లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్నా.. ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యతగల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. నాశిరకం ట్యాంకర్లు పంపిందని, అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టుల్లో తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరానే నిలిపివేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఆదివారం ఇక్కడ సీఎం చంద్రబాబుకు అందించారు.టీటీడీ ల్యాబ్‌లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీకి 10వేల కేజీల నెయ్యి సరఫరాకు ఏఆర్ కంపెనీ ఈ టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారన్నారు. ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో కిలో నెయ్యి రూ. 319.80 చొప్పున రోజుకు 10 వేల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు అంగీకరించిందని జూన్ 12వ తేదీ నుంచి సరఫరా ప్రారంభించిందని ఈవో తెలిపారు.