మక్క రైతులకు తీవ్ర నష్టం… కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

*మక్క రైతులకు తీవ్ర నష్టం… కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి*

 

-ప్రభుత్వ అలసత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం.

నిజామాబాద్ జిల్లా వేల్పూర్, సెప్టెంబర్ 25 (ప్రశ్న ఆయుధం)

తెలంగాణ రాష్ట్రంలో మక్క (మొక్కజొన్న) రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వేల్పూర్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం సహా రాష్ట్రవ్యాప్తంగా మక్క పంట చేతికొచ్చిందని, దాదాపు 60 శాతం పంట ఇప్పటికే కోతకు వచ్చింది. అయితే, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరలకు పంటను ప్రైవేట్ వ్యాపారులకు అమ్మే దిశగా వెళ్తున్నారని విమర్శించారు.

ఎకరానికి రూ.30 వేల నష్టం

ప్రైవేట్ వ్యాపారులు ప్రస్తుతం మక్కను క్వింటాలుకు ₹1800కి కూడా కొనడంలేదని, మొదట ₹2000కి కొనుగోలు ప్రారంభించి ప్రస్తుతం ధర తగ్గించారని వేముల పేర్కొన్నారు. మద్దతు ధర రూ.2400గా ఉన్నా, ప్రభుత్వ స్థాయిలో కొనుగోలు లేకపోవడంతో రైతులు దళారుల చేతిలో పడిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

మొత్తం లెక్కలు వేసుకుంటే ప్రతి ఎకరానికి సుమారుగా 30 క్వింటాళ్లు పంట వస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలతో రైతులు ఎకరానికి ₹30,000 వరకు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పంట తడిచిపోయే ప్రమాదం ఉండటంతో నిల్వ చేసుకోవడం కష్టంగా మారిందని, తక్కువ ధరలకు అమ్మకానికి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.

మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇవ్వాలి

రైతులకు అండగా నిలవాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న మద్దతు ధర ₹2400కు అదనంగా ₹400 బోనస్ కలిపి క్వింటాలుకు ₹2800 చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.

కేసీఆర్ తీరు ఎత్తి చూపింపు

గతంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు పలు ప్రణాళికలు రూపొందించాయని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలాంటి చొరవ చూపడం లేదని విమర్శించారు.

సొయా పంటకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

ఈ ఏడాది సొయా పంట కూడా త్వరలో చేతికొస్తుందని, మక్కతో వచ్చిన అనుభవం సొయాకు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని సూచించారు.

బీజేపీ-BRSతో కలిసి పోరాటానికి సిద్ధం

రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర అమలులో విఫలమైతే, రైతులను కూడదీసి BRS పార్టీ తరఫున ఉద్యమానికి సిద్ధం అవుతామన్నారు.

Join WhatsApp

Join Now