షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం.
కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ల చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల పథకం పాత డిజైన్ ప్రకారమే చేపట్టేందుకు, రూ.23 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి పూర్తిగా రద్దు చేయాలని కుట్ర పన్నిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాత డిజైన్ ప్రకారమే ముందుకెళ్తోందన్నారు. తద్వారా 2.8 టీఎంసీల సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మామిండ్ల అంజయ్య, మాజీ సర్పంచ్ లు ఆనంద్ రావు , రాజా గౌడ్, అన్మాల గంగయ్య, యువ నాయకులు అన్మాల రామ్ కుమార్, అన్మాల దాము తదితరులు పాల్గొన్నారు.