*చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందెలా పటిష్ట చర్యలు….. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి*
*
**ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లోటు రాకుండా చర్యలు*
**రిజర్వాయర్ ల నుండి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించాలి*
**యాసంగి సాగు నీటి సరఫరా , గురుకులాల సందర్శన పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్*
జిల్లాల్లో కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
*రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ,* యాసంగి పంట సంరక్షణకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన మేర పంట పొలాలకు చేరేలా చూడాలని, వ్యవసాయ శాఖకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని సిఎస్ విద్యుత్ అధికారులను ఆదేశించారు.
భారీ నీటి పారుదల శాఖ పరిధిలోని రిజర్వాయర్లలో అవసరమైన మేర సాగునీరు అందుబాటులో ఉందని, పంటలకు సమృద్ధిగా నీరు విడుదల చేయడం జరుగుతుందని, విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా అధికారులు సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని అన్నారు.
యాసంగి లో 77 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోందని, ముఖ్యంగా వరి పంట 54.82 లక్షల ఎకరాల సాగు జరిగిందని, గత సంవత్సరం కంటే 2 లక్షల 70 వేల ఎకరాలు వరి, లక్ష ఎకరాల మొక్కజొన్న పంట అధికంగా పండుతుందని అన్నారు. సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి మొదలగు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని వీటిని పక్కగా పర్యవేక్షిస్తూ పొలాలు ఎండిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు రాక పోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కొంత మేరకు రైతులు ఇబ్బందులకు గురి కావడం గమనించామని అన్నారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు.
ఎస్సారెస్పీ, ఎస్సారెస్పీ స్టేజి 2, నాగార్జున సాగర్, ఏఎంఆర్ లిఫ్ట్ , కల్వకుర్తి , ఇతర ప్రాజెక్టుల కింద నిర్దేశిత పంట పొలాలకు సాగునీరు అందాలని సీఎస్ తెలిపారు. రాబోయే 10 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి వచ్చే డిమాండ్ అనుగుణంగా సాగునీరు విడుదల చేస్తూ రైతుల పొలాలు ఎండిపోకుండా కాపాడాలని సిఎస్ ఆదేశించారు.
ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎక్కడ లోటు రాకుండా చూసుకోవాలని సీఎస్ డిస్కం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న పీక్ డిమాండ్ కు మరో 10 నుంచి 15 శాతం పెరిగినా తట్టుకునెలా విద్యుత్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని సీఎస్ పేర్కొన్నారు.
సాగు నీరు సరఫరా, పంటల పరిస్థితుల పై పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించాలని, రైతులు ఆందోళనకు గురికాకుండా సమృద్ధిగా సాగు నీటి సరఫరా అవుతుందని భరోసా కల్పించాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అన్నారు.
రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ లెవెల్ లో రైతులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఏర్పడే జిల్లాలలో మండలాల వారీగా తహసిల్దార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్, వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, నీటి పారుదల శాఖ సిఈ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా.పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.