ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయని ఒక సామెత ఉంది.
అంటే బండ్లమీద వ్యాపారం చేసిన వాడు ఓడల మీద చేసేటంతగా ఎదిగి పోయాడని, ఓడల మీద వ్యాపారం చేసే వాడు బండ్లమీద చేసే స్థాయికి చితికి పోయాడని, జీవనగమనంలో ఒక మనిషి ఎదగిపోవడం, పడిపోవడం లాంటి సందర్భాలలో ఈ సామెతని వాడతాం.అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరమూ చెప్పలేము. పరిస్థితులు, సందర్భాన్ని బట్టి వస్తువుల స్థాయి, మనుషుల స్థాయి మారుతూ ఉంటాయి. ఒకరిమీద మరొకరు ఆధారపడి సహజీవనం చేయక తప్పదు.ఒక ఊళ్ళో ఉన్న కర్మాగారంలో తయారైన ఓడ రేవుకి చేరాలంటే బండిపైనే వెళ్ళాలి. ఎక్కడో ఖండాంతరాలలో వృత్తిరీత్యా వెళ్ళాల్సివచ్చినప్పుడు బండిని సముద్రమార్గాన ఓడపైనే తీసుకెళ్ళాల్సిఉంటుంది. ఓడని రేవుకి చేర్చినంత మాత్రాన, లేదా బండిని సముద్రం దాటించినంత మాత్రాన మోసుకొని వెళ్ళినది శక్తివంతమైనది, మోయబడింది చేతకానిదని భావించడానికి వీలు లేదు. వేర్వేరు సందర్భాలలో ఒక దానిపై ఒకటి ఆధారపడ్డాయి. అంతేగాని, దేని స్థాయి దానిదే. అశాశ్వతమైన జీవితంలో విధి ఆడే అందమైన ఆట పేరే జీవనం. ఆటలో గెలుపు ఓటమి అనేవి అనిశ్చితం, అశాశ్వతం. అలాగే జీవితంలో మంచిచెడులను సమానంగా స్వీకరించడం అనివార్యం. ఉన్నత స్థాయి వచ్చినప్పుడు పొంగిపోకూడదు. స్థాయి దిగజారిందని కృంగిపోకూడదు. జీవితంలో కిందపడిన స్థితి కష్టపడి పైకిలేవడం నేర్పిస్తుంది. ఎదిగిన స్థితి మళ్ళీ కిందపడకుండా జాగ్రత్త పడడం నేర్పిస్తుంది. అన్నిరకాలైన స్థితిగతులలో సాగిపోతుండడమే జీవితం అంటే. లేకుంటే జీవితమే ఉండదు.దీనిని అర్థం చేసుకోగలిగితే జీవితంలో అసలైన ఆనందాన్ని ఆస్వాదించగలం.