రాక్‌వుడ్ స్కూల్ సమీపంలో కాల్పుల కలకలం
గోరక్షకుడు సోను సింగ్‌పై ఇబ్రహీం కాల్పులు – తీవ్ర గాయాలు
మేడ్చల్ జిల్లా పోచారం ప్రశ్న ఆయుధం అక్టోబర్ 23:
పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్‌వుడ్ స్కూల్ సమీపంలో బుధవారం సాయంత్రం కాల్పుల కలకలం రేగింది. గోరక్షకుడైన సోను సింగ్ అలియాస్ ప్రశాంత్‌పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సోను సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఘట్‌కేసర్ ప్రాంతంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సోను సింగ్ అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం నాయకులతో సంబంధం ఉన్న ఇబ్రహీం అనే వ్యక్తి అతనిపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఘటనపై వెంటనే స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తీవ్రంగా గాయపడిన సోను సింగ్ (ప్రశాంత్)ను గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేపీ నేత డా. చీకోటి ప్రవీణ్ యశోద ఆసుపత్రిలో పరామర్శించనున్నారు. గోవుల రక్షణలో నిమగ్నమై ఉన్న కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ, అక్రమ గోవుల రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.