సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 28:
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఐఏఎస్ అన్నారు.
సోమవారం మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని, ఓపీ సేవలను పెంచాలని సూచించారు. ‘టీబీ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా టీబీ స్క్రీనింగ్, ఎక్స్-రే సేవలను విస్తృతం చేయాలని ఆదేశించారు. ఈడీడీ (ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) కేసులను ఫాలోఅప్ చేయాలని, ఫీవర్ క్యాంపులు పెంచాలని, డెంగ్యూ కేసులను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. చిన్న పిల్లలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఆసుపత్రిలోని జెరియాట్రిక్ వార్డు (వృద్ధుల చికిత్స విభాగం), జిల్లా క్యాన్సర్ సెంటర్, పీడియాట్రిక్ వార్డు (శిశువైద్య విభాగం), ఔట్ పేషెంట్ వార్డు తదితర విభాగాలను సీఈఓ పరిశీలించారు. దివ్యాంగులకు అందుతున్న చికిత్సను సమీక్షించి, వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలపై వివరంగా విచారణ చేశారు. ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, శస్త్రచికిత్సల సంఖ్యపై వైద్యుల నుండి వివరాలు సేకరించారు. ఫార్మసీలో మందుల నిల్వలు, వాటి సరఫరా, ఈ-ఔషధి పోర్టల్ పనితీరు గురించి సమీక్షించారు. అలాగే, ఆభా కార్డుల పంపిణీ, ల్యాబ్ సదుపాయాల కింద తీసుకున్న శాంపిళ్ల వివరాలు, క్షయవ్యాధి (టీబీ) రోగుల చికిత్సకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై కూడా వివరంగా విచారణ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఉమా గౌరీ, సంబంధిత మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.