పది మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్ వల్లూరు క్రాంతి

*విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.*

*సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలి.*

*సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్*

IMG 20250325 181655

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు పది మంది వైద్యులు క్యాజువల్ లీవులు ఎక్కువగా తీసుకున్నట్లు , రోజువారీ విధులకు గైర్హహాజరయినట్లు కలెక్టర్ గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి లేకుండా ఎక్కువ రోజులుగా విధులకు హాజరు గాని వైద్యాధికారులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయానికి సరెండర్ చేయాలని సూపరిండెంట్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సిబ్బంది ఉదయం 9:15 వరకు విధులకు హాజరు కావాలని, ప్రతి రోజు సిబ్బంది వైద్యుల హాజరును పరిశీలించాలని ఆసుపత్రి సూపరిండెంట్ ను ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది తమ విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ ఆర్) నిధులు ఉపయోగించి నిర్మించే ప్రత్యేక వసతి భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చేపట్టాల్సిన మార్పులపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో మాట్లాడారు. రోగులకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్ గా చేరిన వారికి అందిస్తున్న భోజనం, పాలు, బ్రెడ్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని ఫిజియోథెరపీ కేంద్రాన్ని, దంతవైద్య విభగాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫిజియోథెరపీ కేంద్రంలో అవసరమైన పరికరాలను ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ అనిల్ కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now