*ట్రంప్ దెబ్బకు రొయ్య ‘వెల’విల*
గంటల్లోనే కిలో ధర రూ.40 వరకు పతనంపశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగంపై ప్రభావం
ఓ పక్క వ్యాధులు, మరోపక్క ధరల పతనం, పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మింగుడు పడటం లేదు.
భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో, గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్ఠంగా రూ.40 వరకు పడిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.
ఏటా ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా, 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు పంపిస్తున్నారు. మొత్తంగా రూ.18 వేల కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటే అధికం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240 ఉండగా, గురువారం రూ.200కి తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే, ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్ఠంగా కిలోకు రూ.30-40 వరకు తగ్గించారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోయారు. సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు.