బేడిల మైసమ్మ దాబాలో మళ్లీ “సిట్టింగులు” – రూ.50 వేల
జరిమానా
— బైండోవర్ ఉల్లంఘనపై నిజాంసాగర్ పోలీసులు కఠిన చర్య
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 28
నిజాంసాగర్ మండల పరిధిలోని మాగి గ్రామ శివారులో ఉన్న బేడిల మైసమ్మ దాబా మరోసారి వివాదాస్పదంగా మారింది. అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు, సిట్టింగులు నిర్వహించరాదని ముందే హెచ్చరికలు ఇచ్చినా, యజమాని చింతకింది శంకర్ (తండ్రి గంగారం) మళ్లీ అదే తప్పిదానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది ఫిబ్రవరి 6న దాబాలో అక్రమ మద్యం విక్రయాలు జరిపినందుకు సంబంధించి నిజాంసాగర్ ఎస్‌ఐ, ఎమ్మార్వో వద్ద రూ.50,000/- బైండోవర్ చేయించారు. అయినా శంకర్ మార్పు లేకుండా ఆగస్టు 10న మళ్లీ అదే దాబాలో సిట్టింగ్ నిర్వహించగా, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
మొదటి బైండోవర్ షరతులను ఉల్లంఘించినందుకు ఈ రోజు (28.10.2025) నిజాంసాగర్ ఎస్‌ఐ మళ్లీ ఎమ్మార్వో వద్ద శంకర్‌పై చర్య తీసి రూ.50,000/- జరిమానా విధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS హెచ్చరిస్తూ —
> “జిల్లాలోని అన్ని దాబా యజమానులు చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరించాలి. దాబాల్లో మద్యం విక్రయాలు లేదా సిట్టింగులు నిర్వహించడం చట్టవిరుద్ధం. ఒకసారి బైండోవర్ చేసిన తరువాత మళ్లీ ఇలాంటి అక్రమాలకు పాల్పడితే, భారీ జరిమానాలు మరియు కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.