Site icon PRASHNA AYUDHAM

సోమావతి అమావాస్య

IMG 20241230 072617

30th December 2024

*సోమావతి అమావాస్య*:

సోమవారం రోజున అమావాస్య వస్తే దానిని సోమావతీ అమావాస్యగా పేర్కొంటారు. పంచాంగాల్లో అమాసోమవార వ్రతం అని పేర్కొంటారు. సోమవారం శివభక్తులకు ముఖ్యమైనది. అమావాస్యతో కూడిన సోమవారం రుద్రాభిషేకాదులు విశేషంగా నిర్వహించడానికి తగినది అని భక్తులు నమ్ముతారు. సోమావతీ అమావాస్యనాడు మౌనవ్రతం పాటిస్తే వెయ్యి గోవులు దానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మసింధువు వంటి గ్రంథాలు పలికాయి. అలాగే రావిచెట్టును పూజించడం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనినే అశ్వత్థనారాయణ పూజ అంటారు. రావిచెట్టు మొదట్లో ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. చెట్టు చుట్టూ 108సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణల సమయంలో చెట్టు చుట్టూ దారం చుట్టడం కూడా కనిపిస్తుంది. అలాగే రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉన్నచోట కోరికలు మనసులో చెప్పుకుంటూ చెట్టుకొమ్మలకు తోరాలు వంటివి కట్టడం కనిపిస్తుంటుంది. రావిచెట్టును నారాయణ స్వరూపంగానూ, వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆ రెండుచెట్లూ కలిసి ఉన్నచోట లక్ష్మీనారాయణ కల్యాణం నిర్వహిస్తారు. సోమావతీ అమావాస్యనాడు ఆ చెట్లకు ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి కోరికలైనా తీరుతాయని నమ్ముతారు.

Exit mobile version