మా బ్రతుకులు మారేది ఎప్పుడో..?

రహదారి దుస్థితి మారేదెన్నడు…

  • అధ్వాన్నంగా రహదారి
  • అత్యవసర సమయాల్లో రోగులను తరలించాలంటే జడ్డీలే దిక్కు
  • పరిస్థితి విషమించితే రోగుల ప్రాణాలు గాల్లోకి
  • ఊరు పేరు చెబితే రామంటున్న ఆటోలు, ఇతర వాహనాలు
  • అమలుకు నోచుకోని పాలకుల హామీలంటున్న గిరిజనులు
  • టిప్పర్ల ద్వారా రాత్రి సమయాల్లో మట్టి తరలింపు- మట్టి తోలకాలతో మరింత కుదేలవుతున్న రహదారి
    ప్రశ్న ఆయుధం 25జులై భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ప్రతినిది పోలయ్య
    ప్రభుత్వాలు మారినా… పాలకులు మారినా… సాంకేతికత అంతకంతకు అభివృద్ధి చెందుతున్నా ఏజన్సీ ప్రాంతంలో గిరిజనుల జీవితాలు మాత్రం మారడం లేదు. వారికి మౌళిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు, పాలకులు విఫలమవుతున్నారని చెప్పవచ్చు. సెల్ఫోన్ సిగ్నల్ సైతం మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తున్న నేటి రోజుల్లో మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు కనీస అవసరాలను తీర్చడంలో ప్రభుత్వాలు, పాలకులు విఫలమవుతున్నారని చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణే… బూర్గంపహాడ్ మండలంలోని కృష్ణ సాగర్ గ్రామం, చెరువు సింగారం రోడ్. ఈ రహదారి మీదుగా ఇదే పాంతం నుంచి రాత్రి సమయాల్లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం మట్టి తోలకాలు సాగిస్తున్నారు. ఈ మట్టిని తరలిస్తున్న టిప్పర్లు, లారీల వలన రహదారి మరింతగా గుంతలమయంగా మారుతుంది. ఆయా గుంతల్లో వర్షం నీరు చేరి బురదమయంగా మారి వాహనదారులు, పాదాచారులు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇదే గ్రామంలోని పాఠశాలకు ఉపాధ్యాయులు ప్రతి రోజూ వెళ్ళాల్సి ఉన్నా, ఈ రహదారి పరిస్థితి చూసి అనాసక్తి కనబరుస్తున్నారు. ఈ మార్గం మీదుగా ప్రయాణించాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడిన పని. అత్యవసర సమయాల్లో జడ్డీలే దిక్కు.. పరిస్థితి విషమించితే అంతే సంగతులు…
    చిన్నారులు, గర్భిణీలు, వృద్దులు ఎవరికైనా అనారోగ్యం సోకితే అంతే సంగతులు అన్నట్లుగా ఉంది బూర్గంపహాడ్ మండలంలోని చెరువు సింగారం రోడ్ పరిస్థితి. ఈ ఊరు పేరు చెబితే వామ్మో ఆ రోడ్డు మీదుగా మా ఆటోలు, వాహనాలు రావని ఖరాఖండిగా చెబుతున్నారంటే ఈ రహదారి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సందర్భంలో రోగుల పరిస్థితిని బట్టి జడ్జీల ద్వారా రోగులను ప్రధాన రహదారి వరకు తరలించి, ఆ తరువాత ఏదైనా వాహనం ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈలోపు పరిస్థితి విషమిస్తే రోగి ప్రాణాలకే ప్రమాదమని చెప్పవచ్చు. అమలుకు నోచుకోని పాలకుల హామీలంటున్న గిరిజనులు…ఎన్నికల సమయంలో మాత్రం పాలక ప్రభుత్వంతో పాటు ప్రతి పక్ష పార్టీలన్నీ గిరిజన గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ పలు హామీలను గుప్పిస్తుంటారని, ఎన్నికలు ముగిశాక ఇటువైపు తిరిగి చూడరని కృష్ణసాగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బిఆర్ఎస్ పాలనలో సైతం రహదారి గురించి పలువురు అధికారులు, పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి బూర్గంపహాడ్ మండలంలోని అధ్వాన్నంగా ఉన్న చెరువు సింగారం రోడ్ను సిసి రోడ్గా నిర్మించాలని ఈ ప్రాంత గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు వేడుకొంటున్నారు.

Join WhatsApp

Join Now