మెడికల్ కళాశాల అవుట్ సోర్సింగ్ బాధితులతో త్వరలో నిరహార దీక్షలు
– బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్,
గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
మెడికల్ కళాశాల అవుట్ సోర్సింగ్ బాధితులతో త్వరలో నిరహార దీక్షలు చేపట్టనున్నట్లు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్,
గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్ లు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఇటీవలె జరిగిన మెడికల్ కళాశాల ఔట్ సోర్సింగ్ అవకతవకలపై విచారణలో జాప్యం కారణంగా త్వరలోనే అర్హత కలిగి ఉద్యోగం రాని బాధిత అభ్యర్థులతో నిరాహార దీక్షలు చేపట్టబోతున్నామని తెలిపారు. కలెక్టర్ కి గత 18 రోజుల క్రితం బాధిత అభ్యర్థులతో కలిసి వినతిపత్రం ఇస్తే విచారణ చేస్తామని చెప్పడం జరిగిందనీ, వారం క్రితం ప్రజావాణి లో ఇవ్వడం జరిగిందని,అయినా ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం జరగలేదు అన్నారు. అన్ని ఋజువులతో సహా కలెక్టర్ కి సమర్పించిన తరవాత కూడా విచారణలో జాప్యం జరగడం దారుణమన్నారు. గత మెడికల్ కళాశాల నోటిఫికేషన్ లో 38 శాతం ఉన్న అభ్యర్థికి మ్యాన్ పవర్ ఏజెన్సీ నోటిఫికేషన్ మెరిట్ లిస్టులో 72 శాతం రావడమే వాళ్ళ అవినీతికి నిదర్శనం. అలాగే ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఒరిజినల్ లో ఉన్న డేట్, జిరాక్స్ కాపీలో లేకపోవడం అనేది ఏజెన్సీ చేతివాటం బయటపడుతుందన్నారు. ఉపాధి కల్పనాఅధికారి ని అడిగితే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మ్యాన్ పవర్ ఏజెన్సీ వాళ్లకు షోకాజ్ నోటీస్ లు వెళ్ళాయనీ విచారణ చేపడుతున్నామని,ఇంకా వాళ్ళ నుండి ఎలాంటి వివరణ రాలేదని చెప్పడం జరిగిందన్నారు.అన్ని ఋజువులతో సహా చూపెట్టినా కూడా విచారణలో ఇంకా జాప్యం కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరగకుంటే త్వరలోనే నిరాహార దీక్షలు చేపడుతున్నామని,అప్పటికి న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు సైతం పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లావుడ్య రవి, అరవిందు, సంజయ్,గణేష్,రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.