మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
— రాజేష్ చంద్ర ఐపీఎస్
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబరు 24:
జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ మంగళవారం మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన ఆయన, పోలీసులతో సమావేశమై విధుల నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఎస్పీ రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్‌బారక్, టెక్నికల్ రూం తదితర విభాగాలను తనిఖీ చేశారు. మచ్చారెడ్డి ఎస్సై అనిల్ నుండి పెండింగ్ కేసులు, దర్యాప్తు ప్రగతి గురించి వివరాలు తెలుసుకున్నారు.
సిబ్బందికి సూచనలు:
బాధితులతో గౌరవంగా వ్యవహరించి, వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించాలి.
సస్పెక్ట్ కదలికలపై నిఘా పెట్టి, నేరాల నియంత్రణకు గస్తీ పెట్రోలింగ్ పెంచాలి.
కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలి.
దేవాలయాలు, ప్రార్థన స్థలాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలి.
డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలి.
సిబ్బంది నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి.
కామారెడ్డి–సిరిసిల్ల స్టేట్ హైవే ఈ స్టేషన్ పరిధిలో ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రమాదప్రధాన ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
ఉత్సవాల భద్రతపై దృష్టి:
దుర్గా నవరాత్రి సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు, నైట్ పేట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామ పోలీస్ అధికారులు ప్రజలతో తరచూ మమేకమై నేరాల నివారణకు చురుకుగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రత్యేకంగా యువతలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి.చైతన్యరెడ్డి, ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీధర్, మచ్చారెడ్డి ఎస్‌హెచ్‌ఓ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.