ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ ప్రారంభించిన ఎస్పీ
సైబర్ నేరాల నివారణకు 6 వారాల అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 2
కామారెడ్డి: జిల్లాలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపుదల కోసం పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వర్చువల్గా ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 12 వరకు 6 వారాలపాటు ఈ అవగాహన ప్రణాళిక కొనసాగనుందని తెలిపారు. వ్యక్తిగత సమాచారం భద్రత, అనుమానాస్పద లింకులు–కాల్స్ నివారణ, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ, డబ్బు బదిలీల్లో జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రతి వారం ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారందరికీ “వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా పంచుకోను… తెలియని లింకులు నొక్కను” అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్లను ఆవిష్కరించారు. యువత, విద్యార్థులు, ప్రజలు సైబర్ నేరాల నుండి రక్షణ పొందేందుకు అవగాహనే ప్రధాన భద్రతా సాధనమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.