సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణకు, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కార్యదర్శి ఇల్లంబర్తి, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, లా అండ్ ఆర్డర్ డిజి మహేష్ భగవత్ లతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో జరగనున్న జాతీయ రహదారి భద్రతా – 2026, మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లతో మంత్రి సమీక్షించారు. రోడ్డు భద్రత వారోత్సవాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్ సేఫ్టీ మాసంలో విద్యార్థులను , ఉద్యోగులను, వివిధ సంస్థలను భాగస్వామ్యం చేసేలా వారికి అవగాహన సదస్సు లు తదితర అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో రెండు జాతీయ రహదారులైన 65, 161 జాతీయ రహదారిలలో ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా నేషనల్ హైవే–65పై రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణ కోసం పనులు జరుగుచున్న చోట రేడియం స్టిక్కర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ప్రమాదాలు సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున జరుగుతున్నాయని, వాటి నివారణ కోసం రాత్రిపూట పోలీసు గస్తీ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ నిర్వహించడం, డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఆర్ అండ్ బీ ఈఈ రాంబాబు, టీజీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ సంక్షేమ అధికారి విశాలాక్షి, డిటిఓ, అరుణ, బీసీ వెల్ఫేర్ సంక్షేమ అధికారి జగదీష్, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ రామాచారి, ఆర్టిఏ మెంబర్ షేక్ ఫర్హీన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288