బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలనపై దృష్టి

 

–ఎస్పీ రాజేష్ చంద్ర

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 13

 

 

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సోమవారం బీబీపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌లను పరిశీలించిన ఎస్పీ, శుభ్రత, క్రమశిక్షణ పాటించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని సూచించారు.

 

ముందుగా రోల్‌కాల్ పరిశీలించిన ఎస్పీ, హాజరు, గైర్హాజరు సిబ్బంది వివరాలు తెలుసుకొని రోల్‌కాల్ ప్రాముఖ్యతను వివరించారు. ఇది సిబ్బందిలో నిబద్ధత, బాధ్యతా భావాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ వృత్తి పరమైన గౌరవాన్ని కాపాడాలని సూచించారు. శుభ్రమైన యూనిఫారం ధరించడం, వ్యక్తిగత సంస్కారం కాపాడుకోవడం పోలీసు గౌరవానికి ప్రతీక అని అన్నారు.

 

తనిఖీ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “దర్యాప్తులో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకం. ప్రతి కేసును నిజాయితీతో విచారించి ప్రజలకు న్యాయం చేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని తెలిపారు.

 

బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ల సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కదలికలపై తక్షణమే స్పందించాలన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించిన ఎస్పీ, “ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాల చేదన మరింత సులభం అవుతుంది” అని అన్నారు.

 

ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, డయల్‌ 100 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని సూచించారు. విపిఒలు తరచూ గ్రామాలను సందర్శిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.

 

ఈ తనిఖీలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, ఎస్‌ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment