మెదక్/నార్సింగి, మార్చి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగిలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కళ్యాణోత్సవం, బోనాలు సమర్పించారు.
మంగళవారం ఉదయం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పూజలు చేశారు. పండితులు వేద మంత్రాలతో కళ్యాణాన్ని పూర్తి చేశారు. సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలతో గ్రామ వీధులలో మహిళలు ఊరేగింపుగా వచ్చి ఆలయంలో బోనాలను సమర్పించారు.ఈ సందర్భంగా డోలు వాయిద్యాలు, భక్తుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.