పదేళ్ల పాటు రాజభోగాలు అనుభవించిన నేతకు గడ్డుకాలం వచ్చి పడిందట. వరుస కష్టాలతో మాజీమంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. కష్టకాలాన్ని ఎదుర్కోలేక.. బయట చెప్పుకోలేక సతమతం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన్ను చూసి పాపం అనుకునే వారు కొందరైతే పదేళ్ల పాటు నువ్వు చేయలేదా.. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావనే వారే ఎక్కువ ఉన్నారట. ఇంతకీ.. సదరు నేతకు ఎదురవుతున్న కష్టాలేంటి? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న తరుణంలో టి ఎన్ జి ఓ నేతగా ఓ వెలుగు వెలిగారు మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్. తనదైన వాక్చాతుర్యంతో పాటు ఎన్జీవో అండతో.. బీఆర్ఎస్ నేతగా.. తర్వాత ఎంఎల్ఎగా తర్వాత మంత్రిగా ఎదిగారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూపం ఆయన చూపారనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి ఐదేళ్లూ ఎమ్మెల్యే గా తర్వాత ఐదేళ్లు మంత్రిగా అధికారాన్ని శ్రీనివాస్‌గౌడ్ చెలాయించారట. అంతేకాదు.. నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారనే పేరునూ సంపాదించుకున్నారు. రెండోతరం లీడర్లను ఎదగనీయకుండా చేశారనే అపవాదునూ శ్రీనివాస్ మూటగట్టుకున్నారట. అధికారంలో ఉండగా.. ఈయనగారు.. అధికారులపైనా పెత్తనం చెలాయించారట. తన అనుమతి లేకుండా ఏ ఒక్క అధికారి లేదా రాజకీయనేత అడుగు ముందుకు వేయడానికి వీలులేనట్లుగా కట్టడి చేశారట. సమస్యలపై ప్రశ్నించిన జర్నలిస్టులు, ఇతర పార్టీల రాజకీయ నాయకులను టార్గెట్ చేసి.. జైలుపాలు చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అధికారం ఎవరి సొత్తూ కాదు.. జనం తిరగబడితే రాటు తేలిన నేతలైన కొట్టుకుపోవాల్సిందే. పదేళ్ల పాటు భరించిన మహబూబ్ నగర్ జనం.. గత ఎన్నికల్లో ఆయనకు మెండిచేయి చూపించారని నియోజకవర్గంతో పాటు పొలిటికల్ టాక్ నడుస్తోంది.ఇంతకాలం భరించి..అణచివేతకు గురైన వారంతా ఒక్కటై శ్రీనివాస్ గౌడ్‌ను ఓడించారని వార్తలు అప్పట్లో వినిపించాయి.
-ఓడలు బళ్లు.. బళ్లు ఓడలౌతాయంటే ఇదేనేమో
మొన్నటి వరకూ.. ఎవరక్కడ.. అంటూ అధికారం చెలాయించిన మాజీమంత్రికి వరుసగా కష్టాలు వచ్చిపడుతున్నాయట. మహబూబ్‌నగర్‌లోని సర్వే నెంబర్ 523లో జరిగిన అవకతవకల కేసులో శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు ఉన్న మరో ముగ్గురిని.. గతంలోనే రిమాండ్‌కు పంపారు. శ్రీకాంత్ గౌడ్ కొంతకాలం పరారీలో ఉండి ఇటీవల మహబూబ్ నగర్ రూరల్ పోలీసుల వద్ద లొంగిపోయారట. A-4 గా ఉన్న శ్రీకాంత్ గౌడ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం శ్రీకాంత్ గౌడ్ మహబూబ్ నగర్ జైలులో ఉన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాస్.. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను తన ఇంటి వద్దకే రప్పించుకునే వారట. అలాంటిది సోదరుణ్ని చూసేందుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన వచ్చిందని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారట. శ్రీనివాస్ గౌడ్‌కు అనుంగ శిష్యులుగా ఉంటూ వచ్చిన వారంతా వరుసబెట్టి ఇతర పార్టీల్లో చేరుతున్నారట. అధికారం ఉన్నంత కాలం తమను పట్టించుకోలేదని..తమ సమయం వృధా అయ్యిందంటూ వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. వారిని నిలువరించలేక రాజకీయంగా గడ్డు కాలాన్ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుర్కొంటున్నారట. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరిగిందని.. అప్పటి పోలీసుల స్క్రీన్ ప్లే,దర్శకత్వంలో నటించిన శ్రీనివాస్ గౌడ్ ఇటీవల మాట మార్చారట. అత్యుత్సాహంతోనే పోలీసులు ఆ కేసు పెట్టారని తన ప్రమేయం లేదని చెప్పుకుంటున్నారట. ఆయన మాట మారుస్తున్న తీరుపై పాలమూరు జనం మండిపడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపై అధికార పార్టీ సీరియస్‌గా ఉందట. ఆయన చేసిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందట. రానున్న రోజుల్లో పక్కా ఆధారాలతో అన్నదమ్ములను.. జైలుకు పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా పదేళ్ల పాటు తమ ఇష్టారాజ్యాన్ని కొనసాగించిన సోదరులకు రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు వచ్చి పడేలా ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.