*ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల కంటే విభిన్నం.*
*ఎన్నికల నిబంధనలపై సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి.*
*26న ఉదయం 8 గంటలకే ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలి.*
*27న ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు.*
*బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు.*
*కలెక్టరేట్ లో ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ.*
సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్/ జిల్లాఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఎన్నికల సిబ్బందికి సూచించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలకు ఆడిటోరియంలో, మైక్రో అబ్జర్వర్లకు సమావేశ మందిరంలో వేరువేరుగా శుక్రవారం రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓ లకు బ్యాలెట్ బాక్సుల వినియోగ విధానం, వాటికి సీల్ వేయడం, పోలింగ్ ప్రారంభానికి ముందే సిద్ధం చేయడం, పోలింగ్ ముగిసిన తర్వాత సీల్ వేసే విధానం తదితర అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకమైనవని, తడబాటు లేకుండా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను సీరియస్‌గా తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికల నియమావళిని పూర్తిగా అనుసరించి, ఎలాంటి పొరపాట్లకు తావు కల్పించకూడదని సూచించారు. శిక్షణ తరగతులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలన్నింటిని సమగ్రంగా అర్థం చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల విధానం భిన్నంగా ఉంటుందని, బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడే ఈ ఎన్నికలకు ఎక్కువ సమయం పట్టే అవకాశముందని వివరించారు. పోలింగ్ ప్రారంభానికి ఒకరోజు ముందుగా 26వ తేదీ ఉదయం 8.00 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు, తమ బృందాలతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని, అక్కడ పోలింగ్ సామగ్రిని ఖచ్చితంగా పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ 27వ తేదీ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుందని, గడువు ముగిసిన తర్వాత క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్ నెంబర్లు అందించి ఓటింగ్ పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో గుంపుగా చేరుకోవడం, ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం. అధికారుల అనుమతి లేకుండా ఎవరూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉండకూడదని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర మెటీరియల్‌ను చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించుకోవాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్‌ఫోన్లు అనుమతించబడవని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, సంబంధిత మెటీరియల్‌ను కరీంనగర్ రిసెప్షన్ సెంటర్‌లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులు, మైక్రోబ్సర్వర్స్ లదే అని స్పష్టంగా తెలియజేశారు. శిక్షణ కార్యక్రమం ను మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఈడి ఎస్ సి కార్పోరేషన్ రామాచారి, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మండల అధికారులతో పాటు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఓ.పీ.ఓలు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.