సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో రబీ సీజన్ లో యూరియా నిల్వలు, పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలో యూరియా నిల్వలు, పంపిణీ పరిస్థితిని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు యూరియా కొరత ఏర్పడకుండా అవసరమైన మేరకు సమయానికి సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం 4852 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో వున్నాయని, జరుగుతున్న పంపిణీపై సమగ్రంగా పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్ల సమన్వయంతో యూరియా సరఫరా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.