Site icon PRASHNA AYUDHAM

బీసీ హాస్టళ్ల పనితీరు మెరుగుకు త్వరలో ఇన్ స్పెక్షన్ యాప్ – రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

IMG 20241219 WA0147

బీసీ హాస్టళ్ల పనితీరు మెరుగుకు

త్వరలో ఇన్ స్పెక్షన్ యాప్

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

• హాస్టళ్ల నిర్వహణ-విద్యార్థుల భద్రతపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్

• హాస్టళ్లలో ఖాళీగా ఉన్నపోస్టుల భర్తీకి చర్యలు

• వసతి గృహాలను తరుచూ తనిఖీ చేయండి

• డీబీసీడబ్ల్యూవోలకు మంత్రి ఆదేశం

• టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలితాలు రావాల్సిందే

• రాత్రిళ్లు హాస్టళ్ల చుట్టు పక్కల పోలీసు పెట్రోలింగ్

• స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సాయంతో హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం : మంత్రి సవిత

అమరావతి : రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల పనితీరు మెరుగుపర్చడానికి ఇన్ స్పెక్షన్ యాప్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. హాస్టళ్ల ఖాళీగా ఉన్నపోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై హెల్త్ డైరీ నిర్వహించాలని ఆదేశించారు. వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో హాస్టళ్ల నిర్వహణ-విద్యార్థుల భద్రతపై అనే అంశంపై డీబీసీడబ్ల్యూవోలు, హెచ్ డబ్ల్యూవోలతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల హాస్టళ్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, డీబీసీడబ్ల్యూవోలు తరుచూ హాస్టళ్లను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు హాస్టళ్ల పరిశీలనతో హెచ్ డబ్ల్యూవోలు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉంటారన్నారు. దీనివల్ల అటు హాస్టళ్ల నిర్వహణ మెరుగుపడుతుందన్నారు. డీబీసీడబ్ల్యూవోల తనిఖీలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇన్ స్పెక్షన్ యాప్ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ యాప్ లో డీబీసీడబ్ల్యూవోలు చేసిన తనిఖీల వివరాలను ఆప్ లోడ్ చేయాలన్నారు. తాను కూడా గడిచిన 6 నెలల కాలంలో 70 హాస్టళ్ల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. హాస్టళ్ల తరుచూ ఉన్నతాధికారులు సందర్శించడం వల్ల సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేస్తుంటారని వెల్లడించారు.హాస్టళ్ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఇందుకోసం పంచాయతీ, మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. అవసరమైతే మున్సిపల్, పంచాయతీ పారిశుద్య సిబ్బంది సేవల అందించేలా కలెక్టర్ల నుంచి ఉత్తర్వులు జారీచేయిస్తామన్నారు. ముఖ్యంగా స్టాక్ రిజిస్టర్లు పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి స్పష్టంచేశారు.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సాయంతో మరుగుదొడ్ల నిర్మాణం

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సాయంతో హాస్టళ్లలో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకోసం ఆయా హాస్టళ్లలో స్థలంతో పాటు నీటి సదుపాయం కలిగి ఉండాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఆయా హెచ్ డబ్ల్యూవోలు జిల్లా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లాలన్నారు. హాస్టళ్లలో ప్రస్తుతమున్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పరిశుభ్రం లేకుండా విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని మంత్రి హెచ్చరించారు. వంట గదులను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, తడి లేకుండా చూసుకోవాలని తెలిపారు. శీతాకాలం దృష్టిలో పెట్టుకుని వేడి ఆహారంతో పాటు గోరువెచ్చటి తాగునీరు మాత్రమే అందించాలని మంత్రి ఆదేశించారు.

హాస్టళ్ల చుట్టు పక్కల పోలీసు పెట్రోలింగ్

విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని మంత్రి సవిత ఆదేశించారు. ప్రతి నెలా రెండు పర్యాయాలు స్థానిక పీహెచ్సీ సిబ్బంది చేత విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా సెలవులకు ఇంటికెళ్లి తిరిగి వచ్చే విద్యార్థుల ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి సమయాల్లో పోలీసులతో హాస్టళ్ల చుట్టు పక్కల పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు పోలీసు భద్రతలో ఉన్నామన్న భావన కలుగుతుందన్నారు. అదే సమయంలో హాస్టళ్ల చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చునన్నారు.

వంద శాతం ఫలితాలు సాధించాల్సిందే…

విద్యా ప్రగతి ఆధారంగా టెన్త్ విద్యార్థులను ఏ, బీ, సీ గ్రేడ్ లు గా విభజించినట్లు పలువురు హెచ్ డబ్ల్యూబోలు మంత్రి సవితకి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మరో మూడు నెలల్లో జరిగే టెన్త్ పరీక్షల్లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు వంద శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై దృష్టి సారించి, ఏయే సబ్జెక్టులో వెనుకబడిన ఉన్నారో గుర్తించి వారికి స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు ట్యూటర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు.

దాతల సాయం తీసుకోండి…

బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, అదే సమయంలో ఎంపీ ల్యాడ్స్, సీఎస్ఆర్ నిధులతో పాటు దాతల సాయం కూడా తీసుకోవాలని మంత్రి సవిత సూచించారు. తమ జిల్లాల పరిధిలో ఉన్న హాస్టళ్ల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం ఎంపీలను కలిసి వినతిపత్రాలు అందించాలని డీబీడబ్ల్యూఎస్ వోలను సూచించారు. ఇప్పటికే పలువురు ఎంపీలను తాను లేఖలు రాసినట్లు తెలిపారు. సీఎస్ఆర్ ఫండ్స్ కోసం కలెక్టర్లను కలిసి జిల్లాలో ఉన్న పరిశ్రమల నుంచి నిధులు సేకరించాలన్నారు. వాటితో పాటు స్థానికంగా ఉన్న దాతలను కూడా సంప్రదించి, విరాళాలు సేకరించాలన్నారు. వారిచ్చే నిధులతో కొనుగోలు చేసిన హీటర్స్, వాటర్ ప్లాంట్లపై వారి పేర్లు రాయాలని సూచించారు.

డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు

డ్రగ్స్ వల్లే కలిగే అనర్థాలపై హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సవిత తెలిపారు. సీఐ, ఎస్ఐ వంటి అధికారులను పిలిచి డ్రగ్స్ వినియోగిస్తే చట్టపరంగా తీసుకునే చర్యలు, ఆరోగ్య సమస్యలపై వైద్యులతో వివరించాలని మంత్రి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ అదనపు సహాయ సంచాలకులు చంద్రశేఖర్ రాజు, జేడీ శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version