మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.1990లో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు కాల క్రమంలో 2004, 2014 మధ్య పావల వడ్డీ లేని రుణాలు అందించిందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు సోలార్ ప్లాంట్లు, మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి పలు వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు విద్య అవకాశాలను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు చదువుకుంటే వారి కుటుంబం బాగుపడుతుందని కుటుంబాలు బాగుపడతే గ్రామాలు బాగుపడతాయని దామోదర్ రాజనర్సింహ అన్నారు. తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదై ఉండి పార్టీలతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహిళలను అన్ని రకాలుగా ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి అడిషనల్ డిఆర్డిఓ సూర్యారావు, జిల్లా మహిళ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment