సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. శుక్రవారం హత్నూర మండలం మంగాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె ఆకస్మికంగా సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని గృహ నిర్మాణ శాఖ పీడీ చలపతిరావుకు ఆదేశించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మండలంలోని ప్రతి గ్రామంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలను గుర్తించి, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు ఇవ్వాలని తెలిపారు. స్లాబ్ పనులు పూర్తయిన ఇళ్లకు త్వరితగతిన గృహ ప్రవేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నీటి వనరులను పరిశీలించి, అవసరమైన చోట్ల బోర్లు మరమ్మతులు చేయడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.
కాసాల గ్రామంలోని డీసీఎంఎస్ ఎఫ్ఎస్సీ ఫర్టిలైజర్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలను పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సరిపడా నిల్వలో ఉంచాలని, ధరల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.


