కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కొత్త డ్రెయిన్ చివర సోక్‌పిట్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో పారిశుధ్యం, మురికి కాలువల శుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాచారెడ్డి మండలంలో పర్యటించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని అధికారులకు సూచించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద సుమారు రూ.92 వేల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సోక్‌పిట్ పనులకు కలెక్టర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
గ్రామంలోని పనికిరాని బోర్వెల్ను కూడా మూసివేయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా రోజువారీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీపీఓ మురళీ, డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ సరళ, మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

